Automatic Car Tips : ప్రస్తుతం నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల చాలామంది ఆటోమేటిక్ కార్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పదే పదే క్లచ్ తొక్కే పని, గేర్లు మార్చే తలనొప్పి లేకపోవడంతో ఈ కార్లను నడపడం చాలా ఈజీ. అయితే కొత్తగా ఆటోమేటిక్ కారు కొన్న చాలామంది, దానిని కూడా పాత మాన్యువల్ కారు లాగే నడుపుతుంటారు. దీనివల్ల కారులోని అత్యంత ఖరీదైన ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (గేర్‌బాక్స్) తీవ్రంగా దెబ్బతింటుంది. మీ చిన్న చిన్న డ్రైవింగ్ పొరపాట్లు భవిష్యత్తులో లక్షల రూపాయల రిపేర్ బిల్లుకు కారణమవుతాయి. ఆటోమేటిక్ కారు నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కారు పూర్తిగా ఆగకుండా గేర్లు మార్చడం పరమ ప్రమాదం

ఆటోమేటిక్ కార్లు నడిపేవారు చేసే అతి పెద్ద తప్పు.. కారు ఇంకా రన్నింగ్‌లో ఉండగానే గేర్లు మార్చడం. చాలామంది తొందరపాటులో కారు పూర్తిగా ఆగకముందే డ్రైవ్ (D) మోడ్ నుంచి నేరుగా రివర్స్ R) లేదా పార్క్ (P) మోడ్‌కి మార్చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ట్రాన్స్‌మిషన్ లోపల ఉండే గేర్ల చక్రాలపై ఒక్కసారిగా విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది గేర్‌బాక్స్ ఆయుష్షును సగం తగ్గిస్తుంది. అందుకే గేర్ మార్చే ముందు కారును పూర్తిగా బ్రేక్ వేసి ఆపడం అలవాటు చేసుకోవాలి.

కొండ దిగేటప్పుడు న్యూట్రల్ మోడ్ పెడుతున్నారా?

కొంతమంది డ్రైవర్లు ఘాట్ రోడ్లపై లేదా వాలుగా ఉన్న కొండలపై కారు దిగేటప్పుడు న్యూట్రల్ (N) మోడ్ పెడితే ఇంధనం (పెట్రోల్/డీజిల్) ఆదా అవుతుందని నమ్ముతారు. కానీ ఆటోమేటిక్ కార్లలో ఇలా చేయడం చాలా ప్రమాదకరం. కారు న్యూట్రల్‌లో ఉన్నప్పుడు వాహనంపై డ్రైవర్ నియంత్రణ తగ్గుతుంది. అంతేకాకుండా, ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నట్లు భావించడం వల్ల గేర్‌బాక్స్‌కు అందాల్సిన లూబ్రికేషన్ ఆయిల్ అందదు. దీనివల్ల లోపలి విడిభాగాలు ఒకదానికొకటి రాపిడికి గురై త్వరగా అరిగిపోతాయి.

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పదే పదే పార్క్ (P) మోడ్ పెట్టకండి

ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు లేదా కాసేపు జామ్ అయినప్పుడు చాలామంది ప్రతిసారీ కారును పార్క్ (P) మోడ్‌లో పెట్టేస్తుంటారు. నిజానికి పార్క్ మోడ్‌ను కారును పూర్తిగా పార్కింగ్ స్థలంలో ఆపేటప్పుడు మాత్రమే వాడాలి. పదే పదే దీనిని వాడటం వల్ల ట్రాన్స్‌మిషన్ లాకింగ్ మెకానిజం పాడైపోతుంది. సిగ్నల్ దగ్గర తక్కువ సమయం ఉంటే బ్రేక్ తొక్కి ఉంచడం లేదా ఎక్కువ సమయం ఉంటే కేవలం న్యూట్రల్ (N) మోడ్ వాడటం చాలా సురక్షితమైన పద్ధతి.

పార్కింగ్ చేసేటప్పుడు ఈ సరైన పద్ధతి పాటించండి

కారును పార్క్ చేసేటప్పుడు కేవలం P మోడ్ వేసి వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా వాలుగా ఉన్న రోడ్లపై ఇలా చేస్తే కారు బరువంతా గేర్‌బాక్స్ పైనే పడుతుంది. అందుకే కారు ఆపిన తర్వాత మొదట హ్యాండ్‌బ్రేక్ లాగాలి. ఆ తర్వాతే గేర్‌ను పార్క్ (P) మోడ్‌లోకి షిఫ్ట్ చేయాలి. దీనివల్ల కారు బరువంతా బ్రేకింగ్ సిస్టమ్ మోస్తుంది. మీ లగ్జరీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సురక్షితంగా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story