Car Sales : మహీంద్రా, టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఎస్యూవీ సేల్స్ జోరు
Car Sales : భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అక్టోబర్ 2025 నెల చారిత్రక విజయాన్ని అందించింది.

Car Sales : భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అక్టోబర్ 2025 నెల చారిత్రక విజయాన్ని అందించింది. పండుగల సీజన్‌లో పెరిగిన డిమాండ్, కొత్త జీఎస్టీ విధానం తర్వాత కార్ల ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల దేశంలోని ప్రధాన వాహన తయారీ సంస్థలన్నీ రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేశాయి. ముఖ్యంగా మహీంద్రా, టాటా మోటార్స్ తమ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డులను సృష్టించాయి.
మారుతి సుజుకి, కియా, టయోటా వంటి సంస్థలు కూడా లక్షల్లో వాహనాలను విక్రయించాయి. అక్టోబర్‌లో కార్ల కంపెనీలు సృష్టించిన ఈ రికార్డుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 2025 నెలలో ఇండియన్ కార్ల ఇండస్ట్రీ మొత్తం మీద అత్యంత లాభదాయకమైన నెలగా నిలిచింది. ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు అసాధారణ అమ్మకాలు సాధించారు. ఈ భారీ అమ్మకాలకు ప్రధానంగా పండుగల సీజన్ (దసరా, దీపావళి) నుండి వచ్చిన బలమైన డిమాండ్ కారణం. దీనికి తోడు, కొత్త జీఎస్టీ విధానం అమలులోకి రావడంతో కార్ల ధరలు తగ్గడం కూడా కొనుగోలుదారులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
మహీంద్రా అండ్ మహీంద్రా అక్టోబర్‌లో 71,624 ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది గత సంవత్సరం కంటే 31% ఎక్కువ. కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకం. అదేవిధంగా టాటా మోటార్స్ 61,295 యూనిట్ల విక్రయాలతో 26.6% వృద్ధిని నమోదు చేసి, తమ రికార్డును నెలకొల్పింది. టాటా అమ్మకాలలో 77% కంటే ఎక్కువ వాటా ఎస్‌యూవీలదే (నెక్సాన్, పంచ్, హారియర్) కావడం గమనార్హం.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి అక్టోబర్‌లో అత్యధికంగా కార్లను విక్రయించింది. మారుతి సుజుకి అక్టోబర్‌లో 2.42 లక్షల యూనిట్ల రికార్డు అమ్మకాలను నమోదు చేసింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 20% అధికం. కంపెనీ ప్రకారం నవరాత్రితో ప్రారంభమైన 40 రోజుల పండుగ కాలంలో 5 లక్షల కంటే ఎక్కువ బుకింగ్‌లు రాగా, అందులో దాదాపు 4.1 లక్షల యూనిట్లుగా అమ్మకాలుగా మారాయి. ఈ సంఖ్య గత సంవత్సరం కంటే రెట్టింపు కావడం విశేషం.
భారత మార్కెట్‌లో గణనీయమైన వాటాను కలిగి ఉన్న అంతర్జాతీయ కంపెనీలు కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి. దక్షిణ కొరియా తయారీ సంస్థ కియా ఇండియా 29,556 యూనిట్ల అమ్మకాలతో భారత్‌లో తమ చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ రికార్డును నెలకొల్పింది. టయోటా అక్టోబర్‌లో 39% వృద్ధిని నమోదు చేస్తూ 42,892 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాది ఇదే నెలలో 30,845 యూనిట్లు మాత్రమే. స్కోడా 8,252 యూనిట్ల అమ్మకాలతో తమ అతిపెద్ద నెలవారీ అమ్మకాల రికార్డును కూడా సృష్టించింది.

