CNG Cars: రూట్ మారుస్తున్న ఆటోమొబైల్ దిగ్గజాలు.. ఈవీ, సీఎన్జీ అలాగే హైబ్రిడ్ కార్లకు భారీ డిమాండ్
హైబ్రిడ్ కార్లకు భారీ డిమాండ్

CNG Cars: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు కారు కొనాలంటే కేవలం పెట్రోల్ లేదా డీజిల్ అనే రెండు ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు, కఠినతరం అవుతున్న పర్యావరణ నిబంధనల నేపథ్యంతో కస్టమర్లు సీఎన్జీ, హైబ్రిడ్ అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు సైతం తమ మార్కెట్ వ్యూహాలను వేగంగా మార్చుకుంటున్నాయి. కేవలం కొత్త కార్లను పరిచయం చేయడమే కాకుండా, ఒకే మోడల్లో వివిధ రకాల ఇంజిన్ ఎంపికలను కస్టమర్లకు అందించడంపై దృష్టి సారిస్తున్నాయి.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 2026 నాటికి మొత్తం కార్ల విక్రయాల్లో పెట్రోల్ మోడళ్ల వాటా 41 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో పెట్రోల్ వాహనాల వాటా 47 శాతంగా ఉండటం గమనార్హం. మరోవైపు సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల ఉమ్మడి వాటా ఒక్క ఏడాది వ్యవధిలోనే 35 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ముంబై నగరంలో నమోదవుతున్న మొత్తం కార్ల విక్రయాలలో ఏకంగా 40 శాతం వాటా సీఎన్జీ మోడళ్లదే కావడం విశేషం.
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో, జర్మనీకి చెందిన ఫోక్స్‌వాగన్ గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో రాబోయే తమ నూతన మోడళ్లలో ఎలక్ట్రిక్, సీఎన్జీ ఆప్షన్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. రెనో గ్రూప్ ఇండియా సీఈఓ స్టెఫాన్ డెబ్లైస్ మాట్లాడుతూ, భారతదేశంలో ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావాలంటే కేవలం ఒకే రకం ఇంజిన్‌తో కారును తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. అలాగే స్పాంటిస్ సంస్థ కూడా ఏ-సెగ్మెంట్ నుంచి డి-సెగ్మెంట్ వరకు పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు ఏడు కొత్త మోడళ్లను, ఐదు ప్రధాన అప్డేట్లను సిద్ధం చేస్తోంది.
భారతదేశంలో భౌగోళిక పరిస్థితులు, రహదారులు, ఇంధన లభ్యత ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అందుకే మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే తమ ఎస్యూవీ విభాగంలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఆప్షన్లను అందిస్తూనే, ఇటీవల XUV 3XO ZNG పేరుతో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. టయోటా కంపెనీ కూడా కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తమ సీఎన్జీ మోడళ్లలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చింది. మార్కెట్లో టాటా మోటార్స్, మారుతి సుజుకీలు ఇప్పటికే అనేక పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ముందుండగా, మిగిలిన ఆటో దిగ్గజాలు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాయి.

