ప్రతీ ప్లేయర్‌కు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీ

Bajaj Auto : మహిళల టీ20 లీగ్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ విజయోత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ప్రముఖ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో ఆర్‌సీబీ విజేతలకు అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించింది. జట్టులోని ప్రతీ క్రీడాకారిణికి సరికొత్త బజాజ్ చేతక్ C25 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ టీమ్‌కు అఫీషియల్ రైడ్ పార్ట్‌నర్‌గా ఉన్న బజాజ్, ఈ గెలుపును సెలబ్రేట్ చేస్తూ తన లేటెస్ట్ మోడల్‌ను వారికి కానుకగా అందించింది.

బజాజ్ చేతక్ C25 ప్రత్యేకతలు ఏమిటి?

బజాజ్ ఆటో తన చేతక్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత చౌకైన, ప్రాక్టికల్ మోడల్‌గా C25ని మార్కెట్లోకి తెచ్చింది. ఇది ముఖ్యంగా ప్రతిరోజూ ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన స్కూటర్. ఇందులో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల దూరం (IDC సర్టిఫైడ్) ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌ను 750 W ఆఫ్‌-బోర్డ్ ఛార్జర్‌తో కేవలం 2.5 గంటల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

ఫీచర్లు, ధర వివరాలు

తక్కువ ధరలో వస్తున్నప్పటికీ, ఈ స్కూటర్‌లో ప్రీమియం ఫీచర్లు ఏమాత్రం తగ్గలేదు. హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, ఈకో, స్పోర్ట్ రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం గైడ్-మీ-హోమ్ లైటింగ్, ఐపి67 రేటింగ్ కలిగిన బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది పూర్తి మెటల్ బాడీతో రావడం విశేషం. ప్రస్తుతం ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.87,100గా ఉంది. మొదటి 10,000 మంది కస్టమర్ల కోసం బజాజ్ సుమారు రూ.4,300 వరకు ప్రత్యేక రాయితీని కూడా అందిస్తోంది.

ఆర్‌సీబీ విజయానికి బజాజ్ సలామ్

ఈ సందర్భంగా బజాజ్ ఆటో మార్కెటింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ.. "2026లో చారిత్రాత్మక విజయం సాధించిన ఆర్‌సీబీ మహిళా జట్టుకు అభినందనలు. వారి పట్టుదల, ఆత్మవిశ్వాసం చేతక్ బ్రాండ్ విలువలకు ప్రతిబింబం. వారి గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ జట్టులోని ప్రతి ప్లేయర్‌కు చేతక్ C25ను బహుమతిగా ఇస్తున్నాము" అని పేర్కొన్నారు. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించిన మన మహిళా క్రికెటర్లు, ఇప్పుడు రోడ్ల మీద కూడా అదే ఉత్సాహంతో దూసుకుపోవాలని బజాజ్ ఆకాంక్షిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story