Electric Scooter : ఓలా, ఏథర్‌లకు షాక్.. బజాజ్ నుంచి లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్
బజాజ్ నుంచి లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్

Electric Scooter : ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఓలా, ఏథర్ స్కూటర్ల ఆధిపత్యం నడుస్తోంది. అయితే, త్వరలోనే వీరి ఆధిపత్యం ముగియనుందని బజాజ్ ఆటో సిగ్నల్స్ ఇచ్చింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఇటీవల కంపెనీ సేల్స్ రిపోర్ట్‌ను విడుదల చేస్తూ.. త్వరలోనే 'చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్'లో 2903 మోడల్‌ను లాంచ్ చేయబోతున్నామని ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చారు. ఇది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ కాబోతుంది.
బజాజ్ ఆటో తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ లెవల్ మోడల్ లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ట్రెండ్ నిపుణుల అంచనా ప్రకారం.. బజాజ్ ఆటో ఈ కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జూన్ నెలలోనే విడుదల చేయవచ్చు. ఒకవేళ ఇది నిజమైతే.. ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు రాబోయే రోజుల్లో గట్టి పోటీ తప్పదు.
బజాజ్ చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని సమాచారం. ఈ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇంకా ఈ స్కూటర్ కేవలం 3 గంటల 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. చేతక్ 2903 మోడల్ గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లు.
ఈ స్కూటర్లో హిల్ హోల్డ్ ఫీచర్, రెండు రైడ్ మోడ్లు – ఎకో (Eco), స్పోర్ట్ (Sport) వంటి అద్భుతమైన ఫీచర్లు లభిస్తాయి. హిల్ హోల్డ్ ఫీచర్ ఎత్తుపైకి వెళ్ళేటప్పుడు స్కూటర్‌ను వెనక్కి జారిపోకుండా ఆపుతుంది. ఇది చాలా సౌకర్యవంతమైన ఫీచర్. అంతేకాకుండా, చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్లో సీటు కింద 35 లీటర్ల బూట్ స్పేస్ ఉండవచ్చని అంచనా. ఈ ఫీచర్లు ఓలా, ఏథర్ వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇది మెరుగైన ఆప్షన్లుగా నిలువ నున్నాయి.
బజాజ్ చేతక్ కొత్త జనరేషన్ 35 సిరీస్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
3503: రూ.1,02,500 (ఎక్స్-షోరూమ్)
3502: రూ.1,22,499 (ఎక్స్-షోరూమ్)
3501: రూ.1,22,500 (ఎక్స్-షోరూమ్)
అయితే, కొత్తగా రాబోయే చేతక్ 2903 మోడల్ ధర రూ.లక్ష కన్నా తక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ధరతో ఇది భారత మార్కెట్లో అత్యంత సరసమైన, ఫీచర్-ప్యాక్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలవనుంది. ఇది మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించి, ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలును మరింత పెంచే అవకాశం ఉంది.
