Bajaj Chetak EV: ఓలా, టీవీఎస్ సరసన నిలిచిన బజాజ్ ఆటో.. చేతక్ ఈవీ అరుదైన రికార్డు
చేతక్ ఈవీ అరుదైన రికార్డు

Bajaj Chetak EV: భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ దేశీయ విపణిలో 10 లక్షల విక్రయాల మార్కును విజయవంతంగా అధిగమించింది. ఈ మైలురాయిని సాధించడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీల సరసన 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించిన మూడవ భారతీయ సంస్థగా బజాజ్ ఆటో నిలిచింది.
వాహన్ పోర్టల్ గణాంకాలతో వెల్లడైన నిజాలు
కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ తాజా నివేదిక ప్రకారం నవంబర్ 6, 2026 నాటికి బజాజ్ చేతక్ మొత్తం 10,01,135 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. కంపెనీ జనవరి 2020లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభంలో ఈవీ మార్కెట్ కొత్తది కావడం, డీలర్ నెట్వర్క్ పరిమితంగా ఉండటంతో విక్రయాలు మందకొడిగా సాగాయి. అయితే గత కొన్నేళ్లుగా షోరూమ్‌ల సంఖ్య పెరగడం, కస్టమర్లలో నమ్మకం పుంజుకోవడంతో చేతక్ సేల్స్ ఆకాశాన్ని తాకాయి.
2024 నుంచి అమాంతం పెరిగిన ఆదరణ
చేతక్ ప్రయాణంలో 2024 సంవత్సరం ఒక కీలక మలుపుగా మారింది. ఆ సంవత్సరంలో కంపెనీ 2,01,167 స్కూటర్లను విక్రయించి 2023 తో పోలిస్తే ఏకంగా 168 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత 2025లో 2,79,691 యూనిట్ల అమ్మకాలతో 39 శాతం వార్షిక పెరుగుదలను సాధించి, ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో రెండో స్థానానికి ఎగబాకింది. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా రేంజ్, క్వాలిటీ పెంచడం ఈ విజయానికి ప్రధాన కారణమైంది.
2026లోనే 4.12 లక్షల స్కూటర్లు విక్రయం
ప్రస్తుత 2026 సంవత్సరం బజాజ్ చేతక్ బ్రాండ్‌కు అత్యంత కలిసొచ్చిన కాలంగా మారింది. జనవరి 1 నుంచి నవంబర్ 6, 2026 మధ్య కాలంలోనే ఏకంగా 4,12,409 ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 73 శాతం పెరుగుదల. ఒకే సంవత్సరంలో 3 లక్షలు, 4 లక్షల విక్రయాల దాటి కొత్త చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా అక్టోబర్ 2026లో అత్యధికంగా 49,170 యూనిట్ల నెలవారీ విక్రయాలు నమోదయ్యాయి.
5 లక్షల వార్షిక టార్గెట్ దిశగా అడుగులు
దీపావళి పండుగ సీజన్ నవంబర్ నెలలో కూడా కొనసాగుతుండటంతో ఈవీ విక్రయాలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 5 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవాలని బజాజ్ ఆటో భావిస్తోంది. నాణ్యమైన మెటల్ బాడీ, విలక్షణమైన క్లాసిక్ డిజైన్, విశ్వసనీయమైన బ్యాటరీ పనితీరు కారణంగా భారతీయ వాహనదారులు బజాజ్ చేతక్ వాహనానికి పెద్దపీట వేస్తున్నారు

