Bajaj Chetak EV : భారత ఈవీ మార్కెట్లో బజాజ్ చేతక్ ప్రభంజనం.. ఏకంగా 8 లక్షల సేల్స్ దాటి సరికొత్త రికార్డు
ఏకంగా 8 లక్షల సేల్స్ దాటి సరికొత్త రికార్డు

Bajaj Chetak EV : భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ ఊహించని వేగంతో దూసుకుపోతోంది. గడిచిన జూన్ 2026 నెల ఈ రంగానికి ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ ఇప్పటికే 10 లక్షల ఈవీ విక్రయాల మైలురాయిని దాటగా, ఏథర్ ఎనర్జీ 7 లక్షల సేల్స్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 3 లక్షల రిటైల్ విక్రయాల రికార్డులను నమోదు చేశాయి. ఇదే ఊపులో దేశీయ దిగ్గజం బజాజ్ ఆటో సైతం ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. మధ్యతరగతి భారతీయుల నమ్మకమైన బ్రాండ్ అయిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 8 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో సరికొత్త మైలురాయిని అందుకుంది.
రేసులో మూడో స్థానానికి చేరిన బజాజ్
ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్ అందించిన తాజా గణాంకాల ప్రకారం, జనవరి 1, 2020 నుంచి జూన్ 27, 2026 మధ్య కాలంలో బజాజ్ ఆటో సంస్థ మొత్తం 8,00,085 ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు విజయవంతంగా డెలివరీ చేసింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో భారతదేశంలో 8 లక్షలకు పైగా ఈవీ స్కూటర్లను విక్రయించిన మూడో కంపెనీగా బజాజ్ ఆటో నిలిచింది. అంతకుముందు కేవలం ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ మాత్రమే 10 లక్షలకు పైగా టూ-వీలర్లను విక్రయించి మొదటి రెండు స్థానాల్లో నిలవగా, ఇప్పుడు బజాజ్ వాటి సరసన చేరింది.
50 ఏళ్ల నాటి బ్రాండ్ ఇమేజ్
బజాజ్ చేతక్ స్కూటర్‌ను భారత్‌లో మొదటిసారిగా 1972 లో లాంచ్ చేశారు. ఆ రోజుల్లో ఈ స్కూటర్ ప్రతి సామాన్య భారతీయ కుటుంబంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. 1972 నుంచి 2006 వరకు పెట్రోల్ మోడల్‌గా భారత రోడ్లను ఏలిన చేతక్, ఆ తర్వాత కాలక్రమేణా నిలిచిపోయింది. అయితే 2019లో బజాజ్ సంస్థ ఈ ఐకానిక్ స్కూటర్‌ను సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పాత పేరుకున్న సెంటిమెంట్‌ను, నమ్మకాన్ని వాడుకుంటూనే.. అందులో సరికొత్త ఎలక్ట్రిక్ టెక్నాలజీని జోడించడం కంపెనీకి పెద్ద గేమ్ చేంజర్‌గా మారింది. పాత బ్రాండ్ ఇమేజ్, మోడ్రన్ టెక్నాలజీల సూపర్ కాంబినేషనే ఈనాటి చేతక్ ఈవీ సక్సెస్ సీక్రెట్.
మిగిలిన స్కూటర్ల కంటే ఇది ఎందుకు ప్రత్యేకం?
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.96,504 నుంచి ప్రారంభమై రూ.1.39 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ స్కూటర్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం దీని బిల్డ్ క్వాలిటీ. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు బరువు తగ్గించడం కోసం ప్లాస్టిక్ లేదా ఫైబర్ బాడీతో రూపొందుతున్నాయి. కానీ బజాజ్ చేతక్ మాత్రం పూర్తి స్టీల్ బాడీతో వస్తుంది. దీనివల్ల కారు లాంటి రోడ్ గ్రిప్, మన్నిక, పటిష్టత లభించడమే కాకుండా కస్టమర్లకు ఇదొక ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.
రేంజ్, అధునాతన ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ ఈవీ ప్రస్తుతం 2501, 3001, 35 సిరీస్ వంటి విభిన్న వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌లో నియో-రెట్రో డిజైన్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సామాగ్రి పెట్టుకోవడానికి వీలుగా 35 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, వెనక్కి నడపడానికి ఉపయోగపడే రివర్స్ అసిస్ట్ వంటి ఎన్నో మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. ఇక రేంజ్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. నగరాల్లో రోజూ ఆఫీసులకు, ఇతర పనులకు తిరిగే వారికి ఈ రేంజ్ పక్కాగా సరిపోతుందని వాహన విశ్లేషకులు చెబుతున్నారు.

