Bajaj Chetak: దేశంలో పండుగ సీజన్ సందడి మధ్య ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా గత అక్టోబర్ నెల సేల్స్ రిపోర్ట్ చూస్తే కొనుగోలుదారులు ఏ స్కూటర్లకు పట్టం కట్టారో స్పష్టంగా తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి టాప్-3 ఎలక్ట్రిక్ స్కూటర్లు తమ పాత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ భారీ వృద్ధిని నమోదు చేశాయి. పెట్రోల్ ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మళ్లుతున్నారని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

64,134 యూనిట్లతో నంబర్-1గా నిలిచిన బజాజ్ చేతక్

అక్టోబర్ 2026 అమ్మకాల్లో బజాజ్ చేతక్ అందరినీ వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. అక్టోబర్ నెలలో చేతక్ స్కూటర్లు ఏకంగా 64,134 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో కేవలం 34,900 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో చేతక్ డిమాండ్ 83.77 శాతం మేర భారీగా పెరిగింది. బజాజ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, చేతక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,08,582 కాగా, టాప్ వేరియంట్ ధర రూ.1,63,328 వరకు ఉంది.

రెండో స్థానంలో టీవీఎస్ ఐక్యూబ్

టీవీఎస్ మోటార్‌కు చెందిన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ సేల్స్ రేసులో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్‌లో కంపెనీ మొత్తం 50,570 ఐక్యూబ్ స్కూటర్లను విక్రయించింది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సంఖ్య 31,989 యూనిట్లుగా ఉండేది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఐక్యూబ్ అమ్మకాలు 58.09 శాతం మేర పెరిగాయి. టీవీఎస్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఐక్యూబ్ బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,08,993 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఐక్యూబ్ ఎస్ ధర రూ.1,17,642, ఐక్యూబ్ ఎస్టీ ధర రూ.1,58,834 నుంచి మొదలవుతున్నాయి.

అందరినీ ఆశ్చర్యపరిచిన హీరో విడా

అమ్మకాల సంఖ్యలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, వృద్ధి రేటులో మాత్రం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా (Hero Vida) అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 2026లో విడా 30,065 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది అక్టోబర్‌లో కేవలం 14,019 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈసారి ఏకంగా 114.46 శాతం గ్రోత్ సాధించడం విశేషం. విడావర్ల్డ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, దీని VX2 Go మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.79,999 నుంచి ప్రారంభమై రూ.95,000 వరకు ఉంది.

మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు తగ్గట్టుగా ఈవీలు

ఈ మూడు కంపెనీల మధ్య పోటీ వినియోగదారులకు ఎంతో మేలు చేస్తోంది. ఒకవైపు బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లక్ష రూపాయల పైబడి బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటుంటే, మరోవైపు హీరో విడా రూ.80 వేల లోపే ప్రారంభ ధరతో సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. పండుగ సీజన్ తర్వాత కూడా ఇదే స్థాయిలో డిమాండ్ కొనసాగే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story