Bajaj Chetak : టీవీఎస్ ఐక్యూబ్‌కు చెక్.. అదిరిపోయే ఫీచర్లతో బజాజ్ చేతక్ సరికొత్త మోడల్స్ లాంచ్
అదిరిపోయే ఫీచర్లతో బజాజ్ చేతక్ సరికొత్త మోడల్స్ లాంచ్

Bajaj Chetak : భారతీయ రోడ్లపై ఒకప్పుడు రారాజుగా వెలిగిన బజాజ్ చేతక్ తన ఎలక్ట్రిక్ వెర్షన్‌తో ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా బజాజ్ ఆటో సంస్థ తన ఐకానిక్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారీ మార్పులతో అప్‌డేట్ చేసింది. సి సిరీస్ పేరుతో సరికొత్త వేరియంట్లను ప్రవేశపెట్టి, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరింది. పెరిగిన వేగం, త్వరగా అయ్యే ఛార్జింగ్, స్మార్ట్ ఫీచర్లతో ఇప్పుడు చేతక్ మరింత పవర్‌ఫుల్‌గా మారింది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మూడు వేర్వేరు ఆప్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.
బజాజ్ సంస్థ తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని ఇప్పుడు మూడు సిరీస్‌లుగా విభజించింది. అవే C 35, C 30, C 25. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా వీటిని డిజైన్ చేశారు. ఇందులో టాప్ మోడల్ అయిన C 35 01లో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ ఫీచర్ ఇచ్చారు. చేతక్ యాప్ ద్వారా దీనిని వాడుకోవచ్చు. మోటార్ పవర్ కూడా 4.5kW నుంచి 4.8kWకు పెరిగింది. దీనివల్ల బండి పిక్-అప్, పర్ఫార్మెన్స్ గణనీయంగా పెరిగాయి.
కొత్త అప్‌డేట్ లో ప్రధానంగా వేగం, ఛార్జింగ్ పై దృష్టి పెట్టారు. C 35 సిరీస్ మోడల్స్ ఇప్పుడు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. గతంలో ఇది 73 కిమీ మాత్రమే ఉండేది. అలాగే C 30 సిరీస్ వేగం 70 కిమీకి, బేస్ మోడల్ C 25 వేగం 60 కిమీకి పెరిగింది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, C 30 01 మోడల్ ఇప్పుడు కేవలం 2 గంటల 55 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. గతంలో దీనికి దాదాపు 4 గంటల సమయం పట్టేది. ఈ మార్పు వల్ల ఆఫీసులకు వెళ్లే వారికి చాలా సమయం ఆదా అవుతుంది.
గతంలో కొన్ని స్మార్ట్ ఫీచర్ల కోసం కస్టమర్లు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బజాజ్ ఆ పద్ధతిని మార్చేసింది. ఎకో, స్పోర్ట్ రైడ్ మోడ్‌లతో పాటు, కొండ ప్రాంతాల్లో బండి వెనక్కి జారకుండా కాపాడే హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ను C 35, C 30 సిరీస్‌లలో స్టాండర్డ్ ఫీచర్లుగా ఇస్తున్నారు. అంటే మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. దీనివల్ల వాహనదారులకు మంచి విలువ లభిస్తుంది.
కొత్త చేతక్ మోడల్స్ లో ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్ సదుపాయం కూడా ఉంది. మీ స్మార్ట్‌ఫోన్ లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చినట్టుగానే, మీ స్కూటర్ లో కూడా కొత్త ఫీచర్లు లేదా పర్ఫార్మెన్స్ మెరుగుదలలు ఆటోమేటిక్ గా అప్‌డేట్ అవుతాయి. దీనికోసం మీరు సర్వీస్ సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మెటల్ బాడీ, క్లాసిక్ లుక్ తో పాటు ఇప్పుడు అధునాతన టెక్నాలజీ తోడవ్వడంతో, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి బజాజ్ చేతక్ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా మారింది.

