Bajaj: ఆఫ్‌రోడింగ్, లాంగ్ రైడింగ్ ఇష్టపడే టూవీలర్ లవర్లకు బజాజ్ ఆటో అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. కంపెనీ తన మొట్టమొదటి అడ్వెంచర్ (ADV) బైక్‌ను లాంచ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీపావళి పండగ సమయానికి భారత మార్కెట్‌లో అడుగుపెట్టనున్న ఈ కొత్త బైక్ పూర్తి వివరాలు చూద్దాం. భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లోకి సంచలన రీతిలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాల్దిర్ ఫెరేరా అందించిన సమాచారం ప్రకారం ఈ కొత్త అడ్వెంచర్ బైక్‌ను మొదట బ్రెజిల్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నారు. అక్కడి కస్టమర్లకు క్రిస్మస్ కానుకగా ఈ బైక్ లభించనుంది. భారతదేశంలో మాత్రం అంతకంటే ముందే అంటే దీపావళి పండగ సీజన్ నాటికే మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బజాజ్ సంస్థ ఇటీవల ట్రేకర్ అనే పేరును ట్రేడ్‌మార్క్ చేయించడంతో ఈ మోడల్‌కు అదే పేరు పెట్టే అవకాశం ఉంది.

ఆకట్టుకునే ఆఫ్‌రోడింగ్ డిజైన్, రైడింగ్ పొజిషన్

ఇప్పటికే ఈ బైక్ టెస్టింగ్ మోడల్ మనదేశంలో రహదారులపై చక్కర్లు కొడుతూ కెమెరాలకు చిక్కింది. భారతీయ రైడర్ల అభిరుచులకు అనుగుణంగా ఇందులో శారీ గార్డ్‌ను సైతం అమర్చారు. ఆఫ్‌రోడింగ్ బైక్‌లకు ఉండే ప్రత్యేకతలైన ఫ్రంట్ బీక్, ఫోర్క్ గేటర్స్, పైకి ఉండే ఎగ్జాస్ట్ పైప్‌ను ఇందులో అందించారు. రాళ్లు రప్పలు ఉన్న రోడ్లపై మంచి గ్రిప్ ఇచ్చేందుకు వీలుగా ముందు భాగంలో 19 అంగుళాలు, వెనుక భాగంలో 17 అంగుళాల స్పోక్ వీల్స్ ఇచ్చారు. లాంగ్ రైడింగ్‌లో అలసట రాకుండా సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీటు, విశాలమైన ఫ్యూయల్ ట్యాంక్, స్ట్రెయిట్ రైడింగ్ పొజిషన్‌ను కేటాయించారు.

పవర్‌ఫుల్ ఇంజిన్, అంచనా ధర

ఈ అడ్వెంచర్ బైక్ ఇంజిన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రసిద్ధ పల్సార్ N250 మోడల్‌లో వాడే 250సిసి ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 24.5 బిహెచ్‌పి పవర్, 21.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ అందించనున్నారు. భారత మార్కెట్‌లో దీని ప్రారంభ ధర రూ.2 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఈ బైక్ హీరో ఎక్స్‌పల్స్ 210, యెజ్డీ అడ్వెంచర్, సుజుకి వి-స్ట్రోమ్ SX మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే యంగ్ రైడర్లకు బజాజ్ అడ్వెంచర్ బైక్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story