Bajaj : త్రీ-వీలర్ మార్కెట్‌లో బజాజ్ దూకుడు..కొత్త ఈ-రిక్షా రికీ లాంచ్
కొత్త ఈ-రిక్షా రికీ లాంచ్

Bajaj : భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-రిక్షా మార్కెట్‌లో బజాజ్ ఆటో పెద్ద అడుగు వేసింది. త్రీ-వీలర్ విభాగంలో ఎంతో నమ్మకమైన బ్రాండ్‌గా ఉన్న బజాజ్, ఇప్పుడు అదే అనుభవాన్ని ఎలక్ట్రిక్ రిక్షా విభాగంలోకి తీసుకువస్తూ కొత్త రికీని లాంచ్ చేసింది. మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న అసంఘటిత ఈ-రిక్షా మోడల్స్‌లో ఉన్న తక్కువ రేంజ్, బలహీనమైన బ్రేకింగ్, త్వరగా పడిపోయే ప్రమాదం వంటి లోపాలను రికి ద్వారా పరిష్కరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త మోడల్ ద్వారా డ్రైవర్ల సంపాదన పెరుగుతుందని, ప్రయాణికులకు సురక్షితమైన రైడ్ లభిస్తుందని బజాజ్ ధీమా వ్యక్తం చేసింది.
బజాజ్ రికి P4005 మోడల్ ప్రత్యేక ఫీచర్లతో వచ్చింది. ఇందులో 5.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 149కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఈ బ్యాటరీ కేవలం 4.5గంటల్లో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఈ ఫీచర్లు డ్రైవర్లకు ఎక్కువ సమయం పని చేయడానికి, తక్కువ మెయింటెనెన్స్‌కు హామీ ఇస్తాయి. ఇందులో బలమైన మోనోకోక్ ఛాసిస్, హైడ్రాలిక్ బ్రేక్‌లు, ఇండిపెండెంట్ సస్పెన్షన్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ప్యాసింజర్ మోడల్ Bajaj Riki P4005 ధర రూ.1,90,890 (ఎక్స్-షోరూమ్), కార్గో మోడల్ Bajaj Riki C4005 ధర రూ.2,00,876 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
బజాజ్ రికి కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కాదని, ఈ-రిక్షా మార్కెట్‌ను క్రమబద్ధీకరించడానికి, సురక్షితంగా మార్చడానికి వేసిన పెద్ద అడుగు అని కంపెనీ స్పష్టం చేసింది. బజాజ్ 75 ఏళ్ల ఇంజనీరింగ్ అనుభవం ఈ కొత్త ఉత్పత్తిలో కనిపిస్తుంది. తొలి దశలో పైలట్ ప్రోగ్రామ్ విజయవంతం అయిన తర్వాత, రికిని ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్ సహా 100 కంటే ఎక్కువ నగరాల్లో లాంచ్ చేస్తున్నారు. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా దీని లభ్యత మరింత పెరుగుతుందని కంపెనీ తెలిపింది.

