Bentley: ప్రపంచంలో ఖరీదైన లగ్జరీ కార్లకు కొదవ లేదు, కానీ కొన్ని కార్లను కొనాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బెంట్లీ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టోర్కల్లో భాగంగా అత్యంత ప్రత్యేకమైన టోర్కల్ FRGMT కమిషన్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్న ఈ కారును జపాన్‌కు చెందిన ప్రముఖ స్ట్రీట్‌వేర్ డిజైనర్ హిరోషి ఫుజివారాతో కలిసి రూపొందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సాధారణ టోర్కల్ కారు డెలివరీలు ఇంకా ప్రారంభం కాకముందే ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను పరిచయం చేయడం విశేషం.

అడుగడుగునా బ్లాక్ లుక్

బెంట్లీకి చెందిన కస్టమైజేషన్ విభాగం ముల్లినర్ ఈ స్పెషల్ ఎడిషన్‌ను తీర్చిదిద్దింది. కారు మొత్తానికి బెలుగా బ్లాక్ రంగు వేసి స్టైలిష్ బ్లాక్ లుక్ ఇచ్చారు. ఫ్రంట్ గ్రిల్ నుంచి బ్యాడ్జ్‌ల వరకు ప్రతిదీ నలుపు రంగులోనే ఉంటుంది. ఇందులో నల్లటి 22 అంగుళాల వోర్టెక్స్ ఫోర్జ్డ్ అలాయ్ వీల్స్ అమర్చారు, వీటిలో గాలి ఒత్తిడిని తగ్గించే కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. 2003లో టోక్యోలో FRGMT బ్రాండ్‌ను స్థాపించిన హిరోషి ఫుజివారా తన ప్రత్యేక ముద్రను వేశారు. కారు ఫ్రంట్ ఫెండర్లపై చిన్న బెంట్లీ FRGMT బ్యాడ్జ్‌లు, వెనుక టెయిల్‌గేట్‌పై FRGMT లోగో కనిపిస్తాయి.

క్యాబిన్‌లోనూ క్లాసీ ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ థీమ్

బయటి డిజైన్ లాగే ఈ కారు లోపలి భాగం కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. క్యాబిన్‌లో ఇంపీరియల్ బ్లూ, బెలుగా బ్లాక్ రంగుల కలయికను వాడారు. క్రాస్ స్టిచింగ్, పియానో బ్లాక్ ఫినిష్, ప్రత్యేక డిజైన్ డోర్ సిల్ ప్లేట్లతో పాటు డోర్ ప్యానెల్స్‌పై చిన్న బెంట్లీ, FRGMT లోగోలను పొందుపరిచారు. క్యాబిన్‌ను మరీ మెరిసిపోయేలా కాకుండా, ఎంతో హుందాగా, సింపుల్‌గా ఉండే ప్రీమియం లుక్‌తో తయారు చేయడం వల్ల సాధారణ టోర్కల్ కంటే ఇది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

2.8 సెకన్లలోనే 100 కి.మీ వేగం

బెంట్లీ 2028 టోర్కల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అన్ని వేరియంట్లలోనూ 113 kWh బ్యాటరీ ప్యాక్, 800-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. దీని స్టాండర్డ్ మోడల్ 810 hp పవర్, 1,194 Nm టార్క్ ఇస్తుంది. ఇక టోర్కల్ ఎస్ మోడల్ లాంచ్ కంట్రోల్‌తో ఏకంగా 876 hp పవర్, 1,350 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సుమారు 2,700 కిలోల బరువు ఉన్నా టోర్కల్ ఎస్ కేవలం 2.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. వేగం విషయంలో ఇది పోర్షే 911 GT3 RS కంటే కూడా వేగవంతమైనది. 400 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో 20 నిమిషాల లోపే 10 నుంచి 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

ధర ఎంత, ఎవరికి దక్కుతుందో ఇంకా సస్పెన్సే

ఈ అరుదైన టోర్కల్ FRGMT కమిషన్ ధర ఎంత ఉంటుందనేది బెంట్లీ ఇంకా బయటపెట్టలేదు. అంతేకాకుండా ఈ 20 కార్లను ఏయే దేశాల్లో విక్రయిస్తారు, ఇది స్టాండర్డ్ టోర్కల్ ఆధారంగా వస్తోందా లేక పవర్‌ఫుల్ టోర్కల్ ఎస్ ఆధారంగా వస్తోందా అన్నది కూడా స్పష్టం చేయలేదు. అసలు ఈ 20 కార్లకు కొనుగోలుదారులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారా లేదా అనే సస్పెన్స్‌ను కంపెనీ ఇంకా కొనసాగిస్తోంది.

Next Story