Automatic Cars : క్లచ్ నొక్కే బాధ లేదు..బడ్జెట్ ధరలోనే ఆటోమేటిక్ కార్లు..రూ.4.75 లక్షల నుంచే ప్రారంభం
బడ్జెట్ ధరలోనే ఆటోమేటిక్ కార్లు..రూ.4.75 లక్షల నుంచే ప్రారంభం

Automatic Cars : సిటీలో ట్రాఫిక్ కష్టాలు పడలేక చాలామంది ఇప్పుడు మ్యాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఆటోమేటిక్ అంటే లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని.. కానీ ఇప్పుడు బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో అదిరిపోయే కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి కంపెనీలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఈ ఆటోమేటిక్ కార్లను డిజైన్ చేశాయి. దేశంలోనే అత్యంత చౌకైన టాప్-3 ఆటోమేటిక్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
మారుతి ఎస్-ప్రెస్సో : ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన ఆటోమేటిక్ కారు మారుతి ఎస్-ప్రెస్సో. దీని AGS (Auto Gear Shift) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 4.75 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. ఇందులో 998cc ఇంజన్ ఉంటుంది, ఇది 68 bhp పవర్‌ను ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కారు లీటరుకు 25.3 కి.మీ మైలేజీని ఇస్తుంది. తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే ఆటోమేటిక్ కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే వంటి మోడ్రన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
మారుతి ఆల్టో K10 : మారుతి నుంచి మరో బెస్ట్ ఆటోమేటిక్ ఆప్షన్ ఆల్టో K10. దీని AMT మోడల్ ధరలు రూ. 5.71 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఉంటాయి. ఇది కూడా లీటరుకు 24.9 కి.మీ మైలేజీని అందిస్తుంది. పట్టణాల్లో ఇరుకైన గల్లీల్లో డ్రైవ్ చేయడానికి ఈ కారు చాలా సౌకర్యంగా ఉంటుంది. కొత్త అప్‌డేట్‌లో ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా జోడించడంతో సేఫ్టీ పరంగా ఇది మునపటి కంటే మెరుగ్గా మారింది. సిటీలో ఆఫీసు వెళ్లేవారికి, మహిళా డ్రైవర్లకు ఇది చాలా అనువైన కారు.
టాటా పంచ్ : మైక్రో ఎస్‌యూవీ లవర్స్ కోసం టాటా పంచ్ ఒక అద్భుతమైన ఎంపిక. దీని ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.11 లక్షలు. మారుతి కార్ల కంటే దీని ధర కాస్త ఎక్కువైనా, ఇందులో ఫీచర్లు, సేఫ్టీ అద్భుతంగా ఉంటాయి. గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ కారులో 1.2 లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇందులో సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, హర్మాన్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ భద్రత కావాలనుకునే వారు టాటా పంచ్‌ను ఎంచుకోవచ్చు.

