Electric Cars : భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల జోరు కనిపిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లు అంటే చాలా ఖరీదైనవి అనే భావన ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 10 లక్షల లోపే అద్భుతమైన ఫీచర్లు, మంచి రేంజ్ ఇచ్చే కార్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇస్తూ వీటిని ప్రోత్సహిస్తుండటంతో సామాన్యులకు సైతం ఇవి చేరువయ్యాయి.

టాటా పంచ్ ఈవీ

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్ ఈవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 25 kWh బ్యాటరీ ప్యాక్, ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వారి కోసం 35 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది ఏకంగా 365 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అదిరిపోయే డిజైన్, గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి పెద్ద ప్లస్ పాయింట్లు.

టాటా ట్రియాగో ఈవీ

పది లక్షల లోపు బడ్జెట్ లో మరో అద్భుతమైన కారు టాటా ట్రియాగో ఈవీ. ఇది రూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. సిటీలో తిరిగే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో కూడా రెండు ఆప్షన్లు ఉన్నాయి. 19.2 kWh బ్యాటరీ వెర్షన్ 223 కిమీ రేంజ్ ఇస్తుండగా, 24 kWh బ్యాటరీ వెర్షన్ 293 కిమీ రేంజ్ ఇస్తుంది. కాంపాక్ట్ సైజులో ఉండి, ఈజీగా డ్రైవ్ చేయాలనుకునే వారికి ట్రియాగో ఈవీ పర్ఫెక్ట్ ఆప్షన్.

ఎంజీ కామెట్

మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటే, ఎంజీ కామెట్ ఈవీ ఒక విభిన్నమైన ఎంపిక. దీని ప్రారంభ ధర కేవలం రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, ఇది బాటరీ యాజ్ ఏ సర్వీస్ మోడల్ లో వస్తుంది, అంటే మీరు కిలోమీటర్ కు రూ.2.5 చొప్పున బ్యాటరీ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. సిటీల్లో తక్కువ దూరం ప్రయాణించే వారికి, ఆఫీస్ అవసరాలకు ఇది చాలా పొదుపుగా ఉంటుంది. దీని క్యూట్ లుక్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది.

ప్రభుత్వ సబ్సిడీ, ఇతర ప్రయోజనాలు

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫేమ్-II వంటి పథకాల ద్వారా భారీగా సబ్సిడీలను అందిస్తున్నాయి. దీనివల్ల రిజిస్ట్రేషన్ ఫీజులు తగ్గడం, రోడ్ ట్యాక్స్ లో మినహాయింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80EEB కింద ఈవీ లోన్ పై చెల్లించే వడ్డీకి కూడా మినహాయింపు పొందవచ్చు. మెయింటెనెన్స్ ఖర్చు కూడా పెట్రోల్ కార్లతో పోలిస్తే చాలా తక్కువ కావడంతో, దీర్ఘకాలంలో ఈవీలే లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story