లక్షలోపు బడ్జెట్లో బైక్స్ కావాలా ? ఇవి ట్రై చేయండి

Best Mileage Bikes : ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లి రావడానికి ఉపయోగపడే బైక్ అంటే చాలామందికి గుర్తుకొచ్చే మొదటి విషయం మైలేజ్, సరసమైన ధర. పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో ఒక లక్ష రూపాయల బడ్జెట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనడం అనేది చాలామంది కోరిక. మీ రోజువారీ రాకపోకలకు అనువుగా లక్ష లోపు ధరలో అందుబాటులో ఉన్న, అత్యధిక మైలేజ్ ఇచ్చే కొన్ని బెస్ట్ బైక్ ఆప్షన్ల వివరాలు తెలుసుకుందాం.

రోజువారీ ఆఫీస్ రాకపోకల కోసం కొనుగోలుదారులు ముఖ్యంగా రెండు అంశాలపై దృష్టి పెడతారు. అవి మంచి మైలేజ్, లక్ష లోపు ధర. ఈ రెండు అవసరాలను తీర్చే కొన్ని ప్రముఖ బైక్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అత్యధిక మైలేజ్ ఇచ్చే, తక్కువ ధరలో ఉన్న బైక్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.. అవేంటో చూద్దాం.

టీవీఎస్ స్పోర్ట్ : టీవీఎస్ బ్రాండ్‌లో అత్యంత చవకైన బైక్‌లలో ఇదొకటి. దీని ధర రూ.55,100 నుంచి రూ.57,100 (ఎక్స్-షోరూమ్). లీటరుకు 80కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 109 cc ఇంజిన్ కలిగి ఉన్న ఈ బైక్, తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్ కారణంగా కంపెనీ, అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా నిలిచింది.

హీరో స్ప్లెండర్ ప్లస్ : ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్. సంవత్సరాలుగా ఈ బైక్‌పై ప్రజలు తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. దీని ధర రూ.73,902 నుంచి రూ.76,437 (ఎక్స్-షోరూమ్). ఒక లీటర్ పెట్రోల్‌కు సుమారు 60 నుంచి 70 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.

లక్ష రూపాయల బడ్జెట్‌లో మంచి స్టైల్, మెరుగైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి 125సీసీ సెగ్మెంట్‌లో ఈ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

టీవీఎస్ రైడర్ 125 : మోడ్రన్ ఫీచర్లతో కూడిన ఈ బైక్ యువతను ఆకర్షిస్తోంది. దీని ధర రూ.80,500 నుంచి రూ.95,600 (ఎక్స్-షోరూమ్). ఇది లీటరుకు 56.7 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఇందులో 99కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన డిజిటల్ డిస్‌ప్లే ఉంది.

బజాజ్ పల్సర్ 125 : ఆఫీస్ కమ్యూట్‌కు ఇది కూడా మంచి బైక్. పల్సర్ బ్రాండ్ పట్ల నమ్మకం దీనికి అదనపు బలం. దీని ధర రూ.80,004 నుంచి రూ.88,126 (ఎక్స్-షోరూమ్). ఒక లీటర్ పెట్రోల్‌కు 66 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ : ఒక లక్ష రూపాయల బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, మెరుగైన పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ.91,760 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర సుమారు రూ.1.04 లక్షలుగా ఉంది. ఇది సరికొత్త లుక్, సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story