రెండేళ్ల తర్వాత ఈ బండ్లను అమ్మినా 75% డబ్బు వెనక్కి

Best Resale Value Bikes : కొత్త బండి కొనేటప్పుడు మైలేజీ ఎంత ఇస్తుంది? ధర ఎంత? అని అడగడం పాత పద్ధతి. ఇప్పుడు స్మార్ట్ కస్టమర్లు ఆలోచించేది ఒక్కటే.. ఒకవేళ రెండేళ్ల తర్వాత ఈ బండిని అమ్మేస్తే ఎంత డబ్బు వెనక్కి వస్తుంది? అంటే రీసేల్ వాల్యూ అన్నమాట. భారత మార్కెట్లో కొన్ని టూవీలర్లు బంగారం లాంటివి.. కొన్నప్పుడు ఎంత విలువో, వాడి అమ్మేటప్పుడు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. హీరో, హోండా, బజాజ్ వంటి బ్రాండ్ల బండ్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. దానికి కారణం వాటి మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం, విడిభాగాలు ఎక్కడైనా దొరకడమే.

రీసేల్ వాల్యూలో టాప్-5 బండ్లు ఇవే!

1. హీరో స్ప్లెండర్ : భారతదేశంలో 'రీసేల్ వాల్యూ'కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది హీరో స్ప్లెండర్ మాత్రమే. దీని 97-100 సీసీ ఇంజిన్ చాలా సింపుల్ గా ఉంటుంది. కొత్త బండి ధర సుమారు రూ.74,152 ఉంటే.. రెండేళ్లు వాడి, 20 వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కూడా ఈ బండి సుమారు రూ.58,000 కు అమ్ముడవుతుంది. అంటే కొన్న ధరలో దాదాపు 75 శాతం వెనక్కి వస్తుంది. దీని మైలేజీ (లీటరుకు 60 కిమీ పైనే) మరియు తక్కువ ఖర్చుతో కూడిన స్పేర్ పార్ట్స్ దీనికి ఉన్న డిమాండ్‌ను ఎప్పుడూ తగ్గనివ్వవు.

2. హోండా యాక్టివా : స్కూటర్ విభాగంలో హోండా యాక్టివాకు తిరుగులేదు. దీని 110 సీసీ ఇంజిన్ నమ్మకానికి మారుపేరు. కొత్త యాక్టివా ధర రూ.75,433 నుంచి రూ.89,806 వరకు ఉంటుంది. కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 2023 మోడల్ బండి కూడా రూ.50,000 నుంచి రూ.65,000 పలుకుతోంది. అంటే 65-70 శాతం రీసేల్ వాల్యూను ఇది కాపాడుకుంటుంది. అందుకే ఇంట్లో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ యాక్టివానే ఇష్టపడతారు.

3. హోండా షైన్ : 125 సీసీ సెగ్మెంట్లో హోండా షైన్ ఒక సంచలనం. దీని స్మూత్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ కారణంగా సెకండ్ హ్యాండ్ లో కూడా దీనికి విపరీతమైన పోటీ ఉంటుంది. కొత్త బండి ధర రూ.80,852 - రూ.85,211 ఉంటే, సుమారు 37,000 కిలోమీటర్లు తిరిగిన పాత బండి కూడా రూ.60,000 వరకు అమ్ముడవుతోంది. దాదాపు 70 శాతం వరకు తన విలువను కోల్పోకుండా ఉండటం దీని ప్రత్యేకత.

4. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 : ఇది ఒక ఎమోషన్. బేస్ వేరియంట్ ధర సుమారు రూ.1.82 లక్షల నుంచి ప్రారంభమైనా.. దీనికి ఉన్న రెట్రో లుక్, పవర్‌ఫుల్ 350 సీసీ ఇంజిన్ కారణంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దీని ధర అస్సలు తగ్గదు. పదేళ్ల తర్వాత కూడా ఈ బండికి లక్ష రూపాయలు ఇచ్చి కొనేవారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. వింటేజ్ లుక్ ఇష్టపడేవారికి ఇది ఎప్పటికీ ఫస్ట్ ఛాయిస్.

5. బజాజ్ పల్సర్ 150 : యువతకు ఫేవరెట్ అయిన పల్సర్ 150, ప్రాక్టికాలిటీకి కూడా పెద్ద పీట వేస్తుంది. దీని 149 సీసీ DTS-i ఇంజిన్ చాలా పవర్‌ఫుల్. కొత్త మోడల్ ధర రూ.1.12 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. రెండేళ్ల పాత పల్సర్ కూడా రూ.60,000 నుంచి రూ.80,000 వరకు పలుకుతోంది. అంటే దాదాపు 65-75 శాతం రీసేల్ వాల్యూను ఇది అందిస్తోంది. డిజిటల్ కన్సోల్, స్పోర్టీ లుక్ దీనికి సెకండ్ హ్యాండ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story