Car Buying Tips: కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?.. ఈ టైంలో కొంటే లక్షల్లో ఆదా అవ్వడం ఖాయం
లక్షల్లో ఆదా అవ్వడం ఖాయం

Car Buying Tips: కొత్త కారు కొనడం కేవలం మోడల్ ఎంచుకోవడంతో ముగిసే పని కాదు. సరైన సమయంలో కొనుగోలు చేస్తే వేలాది రూపాయల డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు సొంతమవుతాయి. నెల ఆఖరు, పండుగల సీజన్, ఇయర్ ఎండింగ్ ఆఫర్ల ఆధారంగా ఏది బెస్ట్ డీల్ ఇస్తుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. కారు మోడల్, వేరియంట్ ముందే ఫిక్స్ చేసుకున్న వారికి నెల చివరి రోజులు అద్భుతమైన అవకాశం ఇస్తాయి. ప్రతి షోరూమ్ డీలర్‌కు ఒక నెలవారీ సేల్స్ టార్గెట్ ఉంటుంది. నెల ఆఖరుకు వచ్చేసరికి టార్గెట్ పూర్తి చేయడానికి కేవలం కొన్ని కార్లు మాత్రమే మిగిలి ఉంటే, డీలర్లు సొంత కమిషన్ తగ్గించుకుని మరిన్ని డిస్కౌంట్లు ఇవ్వడానికి మొగ్గు చూపుతారు. ఈ సమయంలో కస్టమర్‌కు బేరమాడే వెసులుబాటు ఎక్కువగా లభిస్తుంది. అయితే, అందరు డీలర్లు ఆఫర్లు ఇస్తారని చెప్పలేము. మనకు నచ్చిన రంగు లేదా మోడల్ స్టాక్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
పండుగల సీజన్
దసరా, దీపావళి సీజన్లలో ఆటోమొబైల్ విక్రయాలు జోరుగా సాగుతాయి. కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొత్త ఎడిషన్లు, అదనపు యాక్సెసరీలు, క్యాష్ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఈ సమయంలో అన్ని రకాల మోడళ్లు అందుబాటులో ఉండటం అతిపెద్ద ప్లస్ పాయింట్. కాకపోతే, డిమాండ్ విపరీతంగా పెరగడం వల్ల వెయిటింగ్ పీరియడ్ కొన్ని నెలల పాటు సాగే అవకాశం ఉంది. కొన్ని పాపులర్ మోడళ్లపై కంపెనీలు పెద్దగా ఆఫర్లు ఇవ్వకపోవచ్చు.
డిసెంబర్ ఆఫర్లు
అన్నింటికంటే ఎక్కువ ఆదా కోరుకునే వారికి డిసెంబర్ నెలే ఉత్తమ ఎంపిక. పాత సంవత్సరం స్టాక్‌ను త్వరగా ఖాళీ చేయడం కోసం డీలర్లు, కార్ తయారీ కంపెనీలు న భూతో న భవిష్యత్ రీతిలో తగ్గింపులు ఇస్తాయి. సేల్స్ టార్గెట్లు అందుకోవడానికి భారీగా క్యాష్ బోనస్‌లు ప్రకటిస్తారు. అయితే దీనికి ఒక ప్రతికూలత ఉంది. డిసెంబర్‌లో కొన్న కారు రిజిస్ట్రేషన్ సంవత్సరం పాతదిగా మారుతుంది. భవిష్యత్తులో ఆ కారును రీసేల్ చేయాలనుకున్నప్పుడు కొంత తగ్గింపు కోల్పోవాల్సి వస్తుంది.
మీకు ఏది సెట్ అవుతుంది?
అతి తక్కువ ధరకు, భారీ డిస్కౌంట్లతో కారు సొంతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యమైతే డిసెంబర్ నెలలో కొనుగోలు చేయడం మంచిది. మోడళ్లు, కలర్స్, ఆప్షన్స్ ఎక్కువగా ఉండి, పండుగ ఉత్సాహంలో కారు ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే పండుగల సమయమే సరైనది. అలా కాకుండా పక్కాగా ఒకే మోడల్‌పై కన్నువేసి, వీలైనంత వరకు రేటు తగ్గించి బేరం ఆడాలనుకుంటే నెల చివరి వారంలో షోరూమ్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.

