Car Safety: భారతదేశంలో కార్ల భద్రతా ప్రమాణాలు విప్లవాత్మక మార్పుకు సిద్ధమవుతున్నాయి. ఇకపై కేవలం బలమైన ఇనుప బాడీ, ప్రయాణికుల రక్షణ మాత్రమే కాకుండా ప్రమాదాలను ముందుగానే నివారించే సాంకేతికత ఉంటేనే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించనుంది. కొత్త భారత్ ఎన్‌క్యాప్ 2.0 విధానాన్ని అక్టోబర్ 2027 నుంచి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

మారుతున్న కార్ల భద్రతా గణాంకాలు

ఈ రోజుల్లో కొత్త కారు కొనాలనుకునే ప్రతీ ఒక్కరూ మైలేజ్, లుక్స్‌తో పాటు ప్రధానంగా చూసేది సేఫ్టీ రేటింగ్. ఇప్పటివరకు క్రాష్ టెస్ట్‌లో కారు ఎంత దృఢంగా ఉందనే అంశానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. SIAM 66వ వార్షిక సదస్సులో మాట్లాడిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేవలం క్రాష్ టెస్ట్ ఆధారంగా రేటింగ్ ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకబోతున్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 2027 నుంచి అమలులోకి రానున్న భారత్ ఎన్‌క్యాప్ 2.0 కింద ప్రమాదానికి ముందు, ప్రమాదం జరిగే సమయంలో, ప్రమాదం జరిగిన తర్వాత అందించే అత్యవసర సహాయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే రేటింగ్ నిర్ణయిస్తారు.

ప్రమాద ముందస్తు హెచ్చరికలు

నూతన ప్రమాణాల ప్రకారం కారులో ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేసే ఆధునిక సెన్సార్లు, ఏఐ సాంకేతికత ఉండటం తప్పనిసరి కానుంది. రోడ్డుపై వెళ్లే వాహనదారులతో పాటు కాలినడకన వెళ్లే బాటసారుల భద్రతను సైతం ఈ పరిశీలనలో చేర్చనున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగితే కారు నుంచి బయటపడటం ఎంత సులువు? అత్యవసర వైద్య సాయం ఎంత వేగంగా అందుతుంది? అనే విషయాలు కూడా సేఫ్టీ రేటింగ్‌ను ప్రభావితం చేస్తాయి. దేశంలో ఏటా దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరణిస్తున్న వారిలో 66 శాతం మంది 18 నుంచి 36 ఏళ్ల లోపు యువత కావడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.

డ్రైవింగ్ లైసెన్స్‌కు పాయింట్ల వ్యవస్థ

వాహనాల భద్రతను పెంచడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లకు చెక్ పెట్టేలా గ్రేడెడ్ పాయింట్ వ్యవస్థను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి లైసెన్స్ నుంచి పాయింట్లు కోత పడతాయి. నిర్దేశిత పరిమితి దాటి పాయింట్లు తగ్గితే లైసెన్స్ తాత్కాలికంగా రద్దవుతుంది, తీవ్రమైన ఉల్లంఘనలకు శాశ్వతంగా రద్దు చేసే నిబంధనలు రాబోతున్నాయి. క్రమశిక్షణతో బండి నడిపే బెస్ట్ డ్రైవర్లకు వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంలలో ప్రత్యేక రాయితీలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

తయారీదారులకు తగ్గిన వ్యయం

గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రష్ టెస్ట్ కోసం విదేశాల్లో ఒక కారుపై రూ.2.5 కోట్లు ఖర్చవుతుండగా, మన దేశంలో ప్రారంభించిన భారత్ ఎన్‌క్యాప్‌లో కేవలం రూ.60 లక్షలకే టెస్టింగ్ పూర్తవుతోంది. స్వదేశీ స్టార్టప్‌లు అభివృద్ధి చేసే భద్రతా పరికరాలను ప్రోత్సహించడం వల్ల తక్కువ వ్యయంతోనే అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లు భారత్‌లో తయారవుతాయి. ఇది వాహన తయారీ సంస్థలకు భారం తగ్గించడమే కాకుండా కస్టమర్లకు చవకగా సురక్షితమైన కార్లు అందుబాటులోకి రావడానికి దోహదపడుతుంది.

Next Story