Bharat NCAP 2.0: కారు కొనేవారికి అలర్ట్.. 2027 నుంచి మరింత కఠినంగా మారనున్న సేఫ్టీ టెస్ట్ రూల్స్
సేఫ్టీ టెస్ట్ రూల్స్

Bharat NCAP 2.0: భారతదేశంలో విక్రయించే కార్ల భద్రత ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా భారత్ ఎన్‌క్యాప్ 2.0 కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రణాళిక ప్రకారం 2027 అక్టోబర్ నాటికి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కేవలం కారు లోపల కూర్చున్న ప్రయాణికుల భద్రతను మాత్రమే ప్రధానంగా పరిశీలిస్తుండగా, ఇకపై ప్రమాదానికి ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత జరిగే పరిణామాలను సమగ్రంగా పరీక్షించనున్నారు.
క్రాష్ టెస్టుల్లో కొత్త రూల్స్
ప్రస్తుత భారత్ ఎన్‌క్యాప్ సిస్టమ్‌లో కేవలం మూడు ప్రధాన క్రాష్ టెస్టులు మాత్రమే నిర్వహిస్తున్నారు. కానీ రాబోయే భారత్ ఎన్‌క్యాప్ 2.0 నిబంధనల ప్రకారం కార్లు ఐదు కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ఆఫ్‌సెట్ ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఫుల్-విడ్త్ రిజిడ్ బారియర్ టెస్ట్, లాటరల్ ఇంపాక్ట్ టెస్ట్, పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్, అలాగే రియర్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా కారు బాడీ నిర్మాణం ఎంత పటిష్టంగా ఉందనేది స్పష్టంగా తేలనుంది.
ప్రమాదం జరగకుండా అప్రమత్తం చేసే ADAS టెస్ట్
కొత్త సేఫ్టీ సిస్టమ్ కేవలం యాక్సిడెంట్ జరిగిన తర్వాత రక్షణను మాత్రమే కాకుండా, అసలు ప్రమాదం జరగకుండా కారు ఏ విధంగా నివారిస్తుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా కార్లలో అమర్చే ADAS, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల పనితీరును కచ్చితంగా అంచనా వేస్తారు. ముప్పును ముందే పసిగట్టి డ్రైవర్‌ను అలర్ట్ చేసే ఈ సిస్టమ్ పనితీరు ఇకపై సేఫ్టీ రేటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.
పాదచారులు, ద్విచక్ర వాహనదారుల రక్షణకు ప్రాధాన్యత
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కారులో ఉన్నవారికే కాకుండా రోడ్డుపై నడిచే పాదచారులు, సైకిల్ లేదా బైక్ రైడర్లకు కూడా తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో పాదచారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కారు బోనెట్, బంపర్, విండ్‌షీల్డ్ డిజైన్‌ను ఏ విధంగా మలచాలనే దానిపై కఠినమైన మార్గదర్శకాలు ఉంటాయి. ఒకవేళ పాదచారులతో ఢీకొనే పరిస్థితి వస్తే వారికి తగిలే గాయాల తీవ్రతను ఏ విధంగా తగ్గించవచ్చనే కోణంలో కార్లను పరీక్షిస్తారు.
ప్రమాదం తర్వాత ప్రాణాలు కాపాడే రెస్క్యూ సిస్టమ్
పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత మొదటి కొన్ని నిమిషాలు ఎంతో కీలకమైనవి. అందుకే భారత్ ఎన్‌క్యాప్ 2.0 నిబంధనలలో పోస్ట్-క్రాష్ రెస్క్యూ సిస్టమ్‌ను కూడా చేర్చారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డోర్స్ అన్‌లాక్ అవుతున్నాయా లేదా అనే కోణంలో పరిశీలిస్తారు. అలాగే ఇంధన సరఫరా వెంటనే నిలిచిపోవడం, అత్యవసర సేవల విభాగానికి ఆటోమేటిక్‌గా లొకేషన్ వివరాలు చేరవేయడం వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయా అని తనిఖీ చేస్తారు. ఈ నిబంధనల అమలుతో ఆటోమొబైల్ రంగంలో సరికొత్త భద్రతా ప్రమాణాలు రానున్నాయి.

