Electric Vehicles : ఈవీ సెక్టార్ కు బూస్ట్.. కొత్త ఆన్‌లైన్ పోర్టల్ లాంచ్ చేసిన కేంద్రం
కొత్త ఆన్‌లైన్ పోర్టల్ లాంచ్ చేసిన కేంద్రం

Electric Vehicles :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పెద్ద అడుగు వేసింది. జూన్ 24న, హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఒక కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను తయారు చేసే కంపెనీలు ఒక కొత్త ప్రభుత్వ పథకం కింద దరఖాస్తు చేసుకోగలవు. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి మన దేశీయ పథకాలకు మరింత బలాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ మంత్రి హెచ్.డి. కుమార్ స్వామి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి (SPMEPCI) పథకం కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ విధానం దేశంలో కొత్త ఆవిష్కరణలతో కూడిన ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని భారతదేశాన్ని గ్లోబల్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.
ఈ కొత్త పథకం ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలను భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడం. ఈ పథకం కింద కంపెనీలు భారతదేశంలో తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కనీసం రూ.4,150 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇలా పెట్టుబడి పెట్టినందుకు బదులుగా, ఆ కంపెనీలకు కొన్ని వెసులుబాట్లు లభిస్తాయి ప్రతి సంవత్సరం గరిష్టంగా 8,000 ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. ఈ కార్లపై ఇంపోర్ట్ డ్యూటీని 15%కి పరిమితం చేస్తారు. అయితే, ఈ కార్ల ధర కనీసం రూ.30 లక్షలు ఉండాలి.
ఈ పథకం ప్రయోజనాలను పొందాలనుకునే కంపెనీలకు కొన్ని షరతులు ఉన్నాయి. అవి దరఖాస్తు చేసుకునే గ్రూప్ వార్షిక టర్నోవర్ కనీసం రూ.10,000 కోట్లు ఉండాలి. ఆ కంపెనీ స్థిర ఆస్తులలో కనీసం రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం జూన్ 24, 2025న మొదలైంది. అక్టోబర్ 21, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకుంటే, spmepci.heavyindustries.gov.in అనే పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకంలో మర్సిడెస్-బెంజ్, కియా మోటార్స్, హ్యుందాయ్, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ వంటి పెద్ద గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, టెస్లా, చైనాకు చెందిన బీవైడీ లాంటి కంపెనీలు ఇంకా భారతదేశంలో తయారీ ప్లాంట్‌ను పెట్టడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ మాత్రం ఇప్పటికే భారతదేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.
