Maruti Suzuki : E20 పెట్రోల్ వల్ల ఎలాంటి నష్టం లేదు.. పాత కార్ల యజమానులకు మారుతి సుజుకి బిగ్ రిలీఫ్
మారుతి సుజుకి బిగ్ రిలీఫ్

Maruti Suzuki : భారతదేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వాడకం, దానివల్ల కలిగే పర్యవసానాలపై వాహనదారుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి పాత కార్ల యజమానులకు ఒక ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. కేవలం 10 శాతం ఇథనాల్ (E10) ఇంధనం కోసం తయారు చేసిన పాత కార్లలో కూడా.. ఇప్పుడు వస్తున్న E20 పెట్రోల్‌ను ఉపయోగించడం వల్ల ఇప్పటివరకు ఎలాంటి పెద్ద టెక్నికల్ సమస్యలు రాలేదని కంపెనీ స్పష్టం చేసింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వల్ల పాత వాహనాల ఇంజన్లు పాడైపోతాయని, లోపలి విడిభాగాలు తుప్పుపడతాయని వస్తున్న అనుమానాలను మారుతి సుజుకి కొట్టిపారేసింది.
మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి ఈ విషయమై కొన్ని కీలక గణాంకాలను వెల్లడించారు. దేశంలో 2023 సంవత్సరంలో మొదటిసారిగా E20 పెట్రోల్‌ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చినప్పుడు, భారతదేశపు రోడ్లపై సుమారు 2.84 కోట్ల కార్లు తిరుగుతూ ఉన్నాయి. ఇందులో దాదాపు 1.83 కోట్ల కార్లు 2023 కంటే ముందే తయారైనవి కాగా, మరో 1.5 కోట్ల కార్లు చాలా పాత మోడళ్ల కేటగిరీకి చెందినవి. ఇంత పెద్ద సంఖ్యలో పాత కార్లు ఉన్నప్పటికీ, గత కొన్నేళ్లుగా E20 ఇంధనాన్ని వాడుతున్నా ఏ ఒక్క కార్లలోనూ సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ లేదా ఇంజన్ సీజ్ అవ్వడం కానీ జరగలేదని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన డేటా ప్రకారం ఈ ఇంధనం పూర్తిగా సురక్షితమైనదని కంపెనీ పేర్కొంది.
ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ను ఒకేసారి కాకుండా దశలవారీగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఇంధనాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ముందే, ల్యాబ్‌లలో మరియు వివిధ రకాల పాత, కొత్త వాహనాల్లో వేలాది కిలోమీటర్ల మేర ఎన్నో కఠినమైన పరీక్షలు నిర్వహించారు. పాత తరం వాహనాల్లోని ఫ్యూయల్ లైన్లు, ఇంజన్ పర్ఫార్మెన్స్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ గ్రీన్ ఫ్యూయల్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. అందువల్ల వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సైతం చెబుతున్నారు.
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల మైలేజ్ ఏమైనా తగ్గుతుందా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై నిపుణులు స్పందిస్తూ.. వాహనం వయసు, దానిని మెయింటైన్ చేసే విధానం, ఇంజన్ కండిషన్‌ను బట్టి మైలేజ్ లేదా పికప్‌లో చాలా స్వల్పంగా తేడాలు ఉండే అవకాశం ఉందని అంగీకరించారు. అయితే, ఈ స్వల్ప మార్పు అనేది కారు ఇంజన్‌కు ఎలాంటి శాశ్వత నష్టాన్ని కలిగించదని తేల్చి చెప్పారు. పాత కార్లలో E20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ పడిపోతుందని, ఇంజన్ లైఫ్ తగ్గిపోతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మారుతి సుజుకి తన ప్రాక్టికల్ అనుభవంతో నిరూపించింది.

