BMW F 450 GS : జర్మన్ లగ్జరీ బ్రాండ్ BMW మోటార్‌రాడ్ భారతీయ బైక్ ప్రియుల కోసం ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ తన సరికొత్త BMW F 450 GS మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం లుక్ మాత్రమే కాదు, పవర్‌ఫుల్ ఇంజిన్, అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది. బీఎండబ్ల్యూ తన పాత మోడల్ G 310 GS స్థానంలో ఈ కొత్త F 450 GS ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను భారత్‌లో రూ. 4.7 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఈ ధరతో ఇది నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎం 390 అడ్వెంచర్ వంటి బైక్‌లతో తలపడనుంది. ప్రీమియం బ్రాండ్ నుంచి ఇంతటి శక్తివంతమైన బైక్ ఈ రేంజ్‌లో రావడం గమనార్హం.

ఈ బైక్‌లో 420cc వాటర్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 46.9 bhp పవర్‌ను, 43 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్ గంటకు 165 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల గేర్లు మార్చడం చాలా సులభంగా ఉంటుంది. లాంగ్ రైడ్స్ చేసే వారికి ఈ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

టెక్నాలజీ పరంగా బీఎండబ్ల్యూ ఎక్కడా తగ్గలేదు. ఇందులో 5-ఇంచుల TFT డిస్‌ప్లే ఇచ్చారు. ఇది నేవిగేషన్, బైక్ సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. సేఫ్టీ కోసం ABS Pro, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్స్, ఇంజిన్ టార్క్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. మొబైల్ ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ కూడా ఉంది. ఫుల్ LED లైటింగ్ ఈ బైక్‌కు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

పెద్ద బైక్ అయిన బీఎండబ్ల్యూ R 1300 GS డిజైన్ స్ఫూర్తితో దీనిని రూపొందించారు. ముందు భాగంలో 43 మిమీ అప్‌సైడ్-డౌన్ (USD) ఫోర్కులు, వెనుక భాగంలో అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. రెండింటికీ 180 మిమీ ట్రావెల్ ఉండటం వల్ల రాళ్లు, రప్పలు ఉన్న దారుల్లో కూడా బైక్ చాలా స్టేబుల్‌గా ఉంటుంది. ముందు 19 ఇంచులు, వెనుక 17 ఇంచుల టైర్లతో ఇది పక్కా ఆఫ్‌రోడ్ బైక్‌లా కనిపిస్తుంది.

కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా ఈ బైక్‌ను నాలుగు వేరియంట్లలో (Basic, Exclusive, Sport, GS Trophy) విడుదల చేశారు. ఇందులో GS Trophy టాప్ ఎండ్ మోడల్. అడ్వెంచర్ టూరింగ్, ఆఫ్‌రోడింగ్ అంటే ఇష్టపడే వారికి, అలాగే బీఎండబ్ల్యూ బ్రాండ్ లగ్జరీని కోరుకునే వారికి ఈ బైక్ ఒక సరైన ఎంపిక.

PolitEnt Media

PolitEnt Media

Next Story