BMW: భారతదేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న వేళ జర్మన్ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ తన విక్రయాలను రెట్టింపు చేసేందుకు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 2030 నాటికి భారత్‌లో ప్రతి ఏటా బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లకు చెందిన 30,000 కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2025లో భారత్‌లో మొత్తం 18,001 కార్లను విక్రయించిన కంపెనీ 2026 నాటికి ఈ సంఖ్యను 20,000 దాటించాలని భావిస్తోంది. ఆపై 2030 నాటికి 30 వేల మైలురాయిని అందుకోవడానికి ఎలక్ట్రిక్ కార్లు, లాంగ్ వీల్‌బేస్ మోడళ్లు, ద్వితీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. బీఎండబ్ల్యూ నిర్దేశించుకున్న ఈ భారీ లక్ష్యంలో ఎలక్ట్రిక్ కార్ల పాత్ర అత్యంత కీలకం కానుంది. 2030 నాటికి కంపెనీ సాధించే మొత్తం విక్రయాల్లో దాదాపు 40 శాతం వాటా కేవలం ఎలక్ట్రిక్ కార్లదే అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే 2030 నాటికి విక్రయించే 30,000 కార్లలో సుమారు 12,000 వాహనాలు ఇవి (EV) మోడళ్లే ఉండనున్నాయి.

భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్ వేగంగా పుంజుకుంటోంది. 2025లో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లు కలిసి 3,753 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించగా.. ఇది 2024తో పోలిస్తే 200 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక 2026 మొదటి అర్ధభాగంలోనే ఈవి అమ్మకాలు 78 శాతం పెరిగి 2,359 యూనిట్లకు చేరాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం విక్రయాల్లో ఈవి వాటా 30 శాతానికి మించుతుందని కంపెనీ విశ్వసిస్తోంది.

లాంగ్ వీల్‌బేస్ మోడళ్లకు పెరుగుతున్న క్రేజ్

వెనుక సీటులో కూర్చునే ప్రయాణికులకు ఎక్కువ స్థలం (లెగ్‌రూమ్) అందించే లాంగ్ వీల్‌బేస్ మోడళ్లకు భారతీయ వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2025లో బీఎండబ్ల్యూ మొత్తం అమ్మకాల్లో ఈ మోడళ్ల వాటా 50 శాతంగా ఉంటే, 2026 ప్రథమార్థంలో ఇది 52 శాతానికి చేరింది. ఈ ఏడాది ఆఖరు నాటికి కంపెనీ విక్రయించే కార్లలో 60 శాతానికి పైగా లాంగ్ వీల్‌బేస్ మోడళ్లే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

చిన్న నగరాలకు వ్యాపిస్తున్న లగ్జరీ గాలి

ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్-2, టైర్-3 నగరాల నుంచి లగ్జరీ కార్లకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. పెద్ద నగరాల్లో విక్రయాల వృద్ధి 14 నుంచి 15 శాతం ఉంటే.. చిన్న నగరాల్లో మాత్రం ఇది 20 శాతానికి పైగా నమోదు అవుతోంది. అందుకే ప్రస్తుతం 40 నగరాల్లో ఉన్న తన షోరూమ్‌ల నెట్‌వర్క్‌ను ఈ ఏడాది చివరి నాటికి 50 నగరాలకు విస్తరించనుంది. పుదుచ్చేరి, మైసూర్, హుబ్లీ, నాసిక్, జలంధర్, జోధ్‌పూర్, గువాహటి వంటి నగరాల్లోనూ తన సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ధరల పెంపు సవాలుగా మారినా ఆగేదే లే

డాలర్‌తో రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు, ముడిసరుకులు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల కార్ల తయారీ వ్యయం భారంగా మారింది. దీంతో 2026లో జనవరి, ఏప్రిల్, జులై నెలల్లో కార్ల ధరలను 2 శాతం చొప్పున బీఎండబ్ల్యూ పెంచాల్సి వచ్చింది. ధరలు పెరిగినప్పటికీ భారత లగ్జరీ మార్కెట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న బీఎండబ్ల్యూ 2030 లక్ష్య సాధన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. భారత లగ్జరీ కార్ల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్నదనడానికి బీఎండబ్ల్యూ నిర్ణయించిన ఈ భారీ లక్ష్యాలే నిదర్శనం. కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లు, నగరాల విస్తరణతో ఈ జర్మన్ దిగ్గజం నిర్దేశించుకున్న 30 వేల కార్ల విక్రయ మైలురాయిని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story