లక్షలాది మందికి ఇష్టమైన ఎస్‌యూవీ

Maruti Suzuki Brezza : భారతీయ రోడ్లపై ఎస్‌యూవీల హవాను మొదలుపెట్టిన కార్లలో మారుతి సుజుకి బ్రెజ్జా పేరు ముందు వరుసలో ఉంటుంది. సరిగ్గా పదేళ్ల క్రితం, అంటే 2016లో అడుగుపెట్టిన ఈ సబ్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ.. నేటితో దేశీయ మార్కెట్లో సక్సెస్‌ఫుల్‌గా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. దశాబ్ద కాలంగా అప్రతిహతంగా సాగుతున్న బ్రెజ్జా ప్రయాణం, ఇప్పటికీ ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 కార్ల జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూనే ఉంది.

బ్రెజ్జా ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. తొలినాళ్లలో కేవలం డీజిల్ ఇంజన్‌తో మాత్రమే మార్కెట్లోకి వచ్చిన ఈ కారు, 2020లో వచ్చిన మొదటి ఫేస్‌లిఫ్ట్‌తో పెట్రోల్ వెర్షన్‌లోకి మారిపోయింది. ఆ తర్వాత 2022లో సెకండ్ జనరేషన్ మోడల్‌గా సరికొత్త హంగులతో దర్శనమిచ్చింది. ఇక 2025లో వచ్చిన అడ్వాన్స్‌డ్ సేఫ్టీ అప్‌డేట్స్ దీనిని మరింత సురక్షితమైన కారుగా మార్చాయి. ప్రస్తుతం మార్కెట్లో బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధరలు రూ.8.26 లక్షల నుంచి రూ.13.01 లక్షల వరకు ఉన్నాయి. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, నమ్మదగ్గ ఇంజన్ పర్ఫార్మెన్స్ బ్రెజ్జాను సామాన్యుడి ఫేవరెట్ ఎస్‌యూవీగా మార్చాయి.

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో పవర్‌ఫుల్ 1.5 లీటర్ K15C డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 103PS పవర్, 139Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా ప్యాడిల్ షిఫ్టర్స్‌తో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. మైలేజీ విషయంలో కూడా బ్రెజ్జా వెనక్కి తగ్గలేదు. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 20 కి.మీ వరకు, ఆటోమేటిక్ వెర్షన్ 19.8 కి.మీ వరకు మైలేజీని ఇస్తాయి. పొదుపుగా ప్రయాణించాలనుకునే వారి కోసం ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. ఇది కేజీ గ్యాస్‌కు ఏకంగా 25.5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

బ్రెజ్జా పదేళ్ల ప్రస్థానంపై మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భారతదేశంలో ఎస్‌యూవీ సంస్కృతిని బలోపేతం చేయడంలో బ్రెజ్జా కీలక పాత్ర పోషించింది. నేడు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ మార్కెట్ వాటా 31 శాతానికి పెరగడంలో బ్రెజ్జా కృషి ఎంతో ఉంది" అని ఆయన అన్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫీచర్లను మారుస్తూ రావడం వల్లే బ్రెజ్జా ఈ స్థాయి విజయాన్ని అందుకుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story