Hybrid Cars: ఛార్జింగ్ టెన్షన్ గుడ్‌బై.. మార్కెట్లోకి బడ్జెట్ ధరలోనే అదిరిపోయే హైబ్రిడ్ కార్లు
హైబ్రిడ్ కార్లు

Hybrid Cars: ఎలక్ట్రిక్ కార్లు కొనాలని ఆశ ఉన్నా ఛార్జింగ్ అయిపోతుందేమోననే భయం చాలామందిని వెనక్కి లాగుతోంది. పెట్రోల్ కార్లు కొందామంటే లీటరు ధర, మైలేజ్ చూసి జేబు ఖాళీ అయిపోతుందనే భయం. ఈ రెండింటికీ బెస్ట్ సొల్యూషన్‌గా హైబ్రిడ్ కార్లు నిలుస్తున్నాయి. రాబోయే 18 నుంచి 24 నెలల్లో భారతదేశంలో దాదాపు అర డజను చిన్న హైబ్రిడ్ కార్లు రోడ్లపైకి రాబోతున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌కు తగినట్లుగా ఈ కార్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి.
మారుతి సుజుకి ప్లాన్
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చాలా తక్కువ ఖర్చుతో కూడిన సరికొత్త హైబ్రిడ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. తమ బెస్ట్ సెల్లింగ్ కార్లయిన ఫ్రాంక్స్, బలేనో , స్విఫ్ట్, బ్రెజ్జా మోడళ్లలో ఈ టెక్నాలజీని తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ పవర్ ఫుల్ కాంబినేషన్‌తో వస్తున్న మొదటి మోడల్ 2027 నాటికి భారత రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది.
హ్యుందాయ్, టయోటా, రెనాల్ట్
కేవలం మారుతి మాత్రమే కాకుండా మిగిలిన దిగ్గజ సంస్థలు కూడా ఈ రేసులో దూకుడు పెంచాయి. హ్యుందాయ్ కంపెనీ 2027 మధ్య నాటికి ఒక చిన్న హైబ్రిడ్ కారును భారత్‌లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు టయోటా తన అర్బన్ క్రూయిజర్ టైజర్ హైబ్రిడ్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇక ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ బ్రిడ్జర్ కాన్సెప్ట్ ఆధారంగా 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే అర్బన్ ఎస్‌యూవీపై పనిచేస్తోంది. దీనిని కూడా వచ్చే ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జీఎస్టీ తగ్గింపు
ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న మారుతి, హోండా, టాటా, టయోటా హైబ్రిడ్ కార్ల ధరలు రూ.16 లక్షలకు పైనే ఉన్నాయి. పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువగా ఉండటం వల్ల వీటిపై పన్నుల భారం అధికంగా పడేది. అయితే సెప్టెంబర్ 2025లో అమల్లోకి వచ్చిన జిఎస్‌టి నిబంధనల ప్రకారం 4 మీటర్ల కంటే చిన్నగా ఉండే హైబ్రిడ్ కార్లపై పన్నును 18 శాతానికి తగ్గించారు. దాంతో తక్కువ ధరకే కంపెనీలు కార్లను తయారు చేయడానికి, సామాన్యులు కొనుగోలు చేయడానికి బాటలు పడ్డాయి.
మైలేజ్ దెబ్బకి పెట్రోల్ బంకులు ఖాళీ
ఈ హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా పనిచేస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ లేకుండా లీటరు పెట్రోల్‌కు సాధారణ కార్ల కంటే డబుల్ మైలేజ్ సాధించవచ్చు. దీనికితోడు ఏప్రిల్ 1, 2027 నుంచి అమల్లోకి రానున్న కేఫ్-3 నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి ఈ టెక్నాలజీ కార్ల తయారీ సంస్థలకు ఎంతగానో ఉపయోగపడనుంది.

