Car Buying Tips: దీపావళికి కారు కొంటే లాభమా? డిసెంబర్ దాకా ఆగితే మంచిదా? అసలు నిజం ఇదే
అసలు నిజం ఇదే

Car Buying Tips: పండగ సీజన్ ప్రారంభం కాగానే కొత్త కారు కొనాలని కలలు కనేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ధనత్రయోదశి, దీపావళి పండగల సమయంలో కొత్త వాహనం ఇంటికి తెచ్చుకోవడం శుభ పరిణామంగా చాలా మంది భావిస్తుంటారు. మరోవైపు డిసెంబర్ నెలలో ఇయర్ ఎండ్ సేల్స్ పేరుతో ఆటోమొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. దీంతో ప్రస్తుతం దీపావళికి కారు కొనడం లాభదాయకమా లేక డిసెంబర్ వరకు వేచి చూడటం మంచిదా అనే సందేహం కొనుగోలుదారులలో వ్యక్తమవుతోంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా వేల రూపాయల సొమ్మును ఆదా చేసుకోవచ్చు.
దీపావళికి కారు కొంటే లభించే ప్రయోజనాలు
దీపావళి పండగ సమయానికి కార్ షోరూమ్‌లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు, ఫ్రీ యాక్సెసరీస్ వంటి అనేక వెసులుబాట్లు కల్పిస్తాయి. ఈ సమయంలో కొనుగోలు చేయడం వల్ల నచ్చిన రంగు, వేరియంట్లు ఎంచుకోవడానికి విస్తృతమైన స్టాక్ అందుబాటులో ఉంటుంది. పండగ పూట కొత్త వాహనం డెలివరీ తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం. అయితే విపరీతమైన డిమాండ్ ఉన్న పాపులర్ మోడళ్లపై వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని గమనించాలి.
డిసెంబర్ నెలలో భారీ తగ్గింపులు ఎందుకు?
ఏడాది చివర్లో అంటే డిసెంబర్ మాసంలో కంపెనీలు తమ వార్షిక సేల్స్ టార్గెట్లను చేరుకోవడానికి, పాత స్టాక్‌ను ఖాళీ చేయడానికి ప్రాధాన్యత ఇస్తాయి. దీనివల్ల డీలర్లు కస్టమర్లకు మరింత ఎక్కువ డిస్కౌంట్లు, అదనపు ప్రయోజనాలు ఇచ్చేందుకు సిద్ధపడతారు. మార్కెట్లో కొద్దిగా డిమాండ్ తక్కువగా ఉన్న మోడళ్లపై కస్టమర్లు గట్టిగా బేరసారాలు ఆడేందుకు అవకాశం లభిస్తుంది. అయితే డిసెంబర్ చివర్లో నచ్చిన రంగు లేదా వేరియంట్ అందుబాటులో ఉండకపోవచ్చు. పాత తయారీ సంవత్సరం ఉండే కారు మాత్రమే లభించే అవకాశాలు ఉంటాయి.
డిసెంబర్ కొనుగోలులో ఉండే ప్రతికూలతలు
డిసెంబర్లో కారు కొనుగోలు చేయడం వల్ల ప్రధాన సమస్య రీసేల్ వాల్యూ రూపంలో ఎదురవుతుంది. ఉదాహరణకు మీరు డిసెంబర్ 2026లో కారు కొని, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు విక్రయించాలని అనుకుంటే దానిని 2026 మోడల్‌గానే పరిగణిస్తారు. అదే జనవరి 2027లో కొంటే మోడల్ ఇయర్ మారుతుంది కాబట్టి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మెరుగైన రీసేల్ ధర లభిస్తుంది. అలాగే డిసెంబర్లో పరిమితమైన స్టాక్ మాత్రమే ఉండటం వల్ల కస్టమర్లకు ఛాయిస్ తక్కువగా ఉంటుంది.
ఏ సమయంలో కారు కొనడం ఉత్తమం?
మీకు పండగ రోజే కారు కావాలి, నచ్చిన కలర్, మోడల్ ఎంచుకోవాలనుకుంటే దీపావళి ఆఫర్లను ఉపయోగించుకుని ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిది. కేవలం డిస్కౌంట్ మాత్రమే ప్రధాన లక్ష్యమైతే, రీసేల్ వాల్యూ గురించి పెద్దగా పట్టించుకోకపోతే డిసెంబర్ వరకు వేచి చూడటం లాభదాయకం. అంతేకాకుండా ప్రతి నెలా చివరి రోజుల్లో డీలర్లు తమ సేల్స్ టార్గెట్లను రీచ్ అవ్వడానికి అదనపు ఆఫర్లు ఇస్తుంటారు కాబట్టి వివిధ షోరూమ్‌లలో ఎంక్వైరీ చేసి బెస్ట్ డీల్ సొంతం చేసుకోవచ్చు.

