Used Car Tips : సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ధరలో వస్తోంది కదా అని ఆత్రుతగా ముందుకు వెళ్తే అడ్డంగా బుక్కయ్యే ఛాన్స్ ఉంది. పాత కార్ల మార్కెట్లో ఇప్పు ఓడోమీటర్ ట్యాంపరింగ్ అనే మాయాజాలం విపరీతంగా పెరిగిపోయింది. కారు లక్ష కిలోమీటర్లు తిరిగినా, మీటర్ తిప్పేసి కేవలం 30 వేల కిలోమీటర్లే తిరిగినట్లు నమ్మిస్తారు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే, కారు కొనేముందు మీరు కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. అవేంటో వివరంగా చూద్దాం.

సర్వీస్ హిస్టరీని పరిశీలించండి

కారు కండిషన్ తెలుసుకోవడానికి అత్యంత నమ్మకమైన మార్గం సర్వీస్ హిస్టరీ. ఏదైనా కారు అధీకృత సర్వీస్ సెంటర్‌కు వెళ్లినప్పుడు, ఆ సమయంలో కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో కంపెనీ రికార్డుల్లో నమోదవుతుంది. మీరు కారు యజమానిని అడిగి సర్వీస్ బుక్ తీసుకోవచ్చు లేదా ఆ షోరూమ్ కి వెళ్లి కారు నంబర్ చెబితే పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ఉదాహరణకు, 2024లో సర్వీస్ చేసినప్పుడు 80,000 కిలోమీటర్లు ఉండి, ఇప్పుడు 2026లో మీరు కొనేటప్పుడు 50,000 కిలోమీటర్లు చూపిస్తే అది కచ్చితంగా మోసమేనని అర్థం చేసుకోవాలి.

కారు కండిష, రీడింగ్‌కు పొంతన ఉందా?

కారు మీటర్ తక్కువ రీడింగ్ చూపిస్తున్నా, లోపల సీట్లు బాగా అరిగిపోయి, స్టీరింగ్ వీల్ రంగు వెలిసిపోయి, టైర్లు అరిగిపోయి కనిపిస్తే అది అనుమానించదగ్గ విషయమే. కేవలం 20 వేల కిలోమీటర్లు తిరిగిన కారు క్లచ్ పెడల్ లేదా బ్రేక్ పెడల్ అరిగిపోదు. ఒకవేళ ఇవన్నీ పాతవిగా కనిపిస్తూ, మీటర్ రీడింగ్ మాత్రం తక్కువగా ఉంటే ఆ కారును ఎక్కువ దూరం వాడి, ఆ తర్వాత మీటర్ తగ్గించారని స్పష్టమవుతుంది.

టెస్ట్ డ్రైవ్ - మీటర్ పర్ఫామెన్స్ గమనించండి

కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓడోమీటర్ వైపు ఒక కన్నేసి ఉంచండి. డిజిటల్ మీటర్ అయితే రీడింగ్ అప్పుడప్పుడు ఆగిపోతున్నట్లు అనిపించినా, అనలాగ్ మీటర్ అయితే ముల్లు వణుకుతున్నట్లు అనిపించినా ఆ మీటర్‌తో ఎవరో టాంపరింగ్ చేశారని అర్థం. అలాగే డాష్‌బోర్డ్ చుట్టుపక్కల స్క్రూలు ఏమైనా విప్పినట్లు గుర్తులు ఉన్నాయేమో చూడండి. మీటర్ రీడింగ్ మార్చడానికి డాష్‌బోర్డ్ విప్పడం తప్పనిసరి, కాబట్టి ఆ గుర్తులు మోసాన్ని పట్టేస్తాయి.

మెకానిక్ సలహా, ఆర్సీ వెరిఫికేషన్

ఎంత తెలివైన వారైనా కారు లోపల ఇంజిన్ లో లోపాలను కనిపెట్టడం కష్టం. అందుకే కారు ఫైనల్ చేసే ముందు ఒక అనుభవజ్ఞుడైన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లండి. ఆయన కారు ఇంజిన్ సౌండ్, వైరింగ్ చూసి అది ఎంత తిరిగిన కారో ఇట్టే చెప్పేస్తారు. అలాగే ఆర్సీ కాపీని చూసి కారు ఎప్పుడు రిజిస్టర్ అయ్యిందో గమనించండి. పదేళ్ల నాటి కారు కేవలం 20 వేల కిలోమీటర్లే తిరగడం అనేది అసాధ్యం కాకపోయినా, చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి.

టైర్ల తయారీ తేదీని చెక్ చేయండి

సాధారణంగా కొత్త కారు టైర్లు 40,000 నుంచి 50,000 కిలోమీటర్ల వరకు వస్తాయి. ఒకవేళ కారు రీడింగ్ 20,000 కిలోమీటర్లే చూపిస్తూ, టైర్లు మాత్రం కొత్తవి వేసి ఉంటే.. ఎందుకు మార్చారో అడగండి. అలాగే టైర్ల మీద తయారీ వారం, సంవత్సరం ఉంటుంది. కారు తయారీ ఏడాదికి, టైర్ల తయారీ ఏడాదికి తేడా ఎక్కువగా ఉంటే లోతుగా ఆరా తీయండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ కష్టపడి సంపాదించిన సొమ్ము మోసగాళ్ల పాలు కాకుండా చూసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story