Price Hike : కార్ల ప్రియులకు గట్టి షాక్.. జూన్ 1 నుంచి భారీగా పెరిగిన మారుతి, హ్యుందాయ్ ధరలు
జూన్ 1 నుంచి భారీగా పెరిగిన మారుతి, హ్యుందాయ్ ధరలు

Price Hike : కొత్త కారు కొనాలనుకునే మధ్యతరగతి వాహనదారులకు ఆటోమొబైల్ కంపెనీలు గట్టి షాకిచ్చాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్ తమ వాహనాల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన కొత్త ధరలు జూన్ 1, 2026 నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేశాయి. అయితే, జూన్ 1 కంటే ముందే కార్లను బుక్ చేసుకున్న కస్టమర్లకు పాత ధరలకే డెలివరీ ఇస్తామని కంపెనీలు ప్రకటించడం ఒక్కటే కాస్త ఊరట కలిగించే విషయం.
రూ. 30,000 వరకు పెంచేసిన మారుతి సుజుకి
భారత కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకి తన కార్ల ధరలను మోడల్‌ను బట్టి గరిష్టంగా రూ.30,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. నిజానికి కంపెనీ ఈ ఏడాది జనవరిలోనే ధరలు పెంచాలని భావించినప్పటికీ, చిన్న కార్ల అమ్మకాలు బాగుండటంతో మొదటిసారి కారు కొనేవారికి ఇబ్బంది కలగకూడదని అప్పట్లో వాయిదా వేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జూన్ 1 నుంచి ఈ పెంపును అమలు చేసింది. ఏ మోడల్‌పై ఎంత ధర పెరిగిందనే పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
హ్యుందాయ్ కార్లపై 1 శాతం వరకు అదనపు భారం
మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా సైతం తన అన్ని కార్ల ధరలను 1 శాతం వరకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ నెలలోనే జరగాల్సిన ఈ ధరల పెంపును కంపెనీ ఒక నెల పాటు హోల్డ్‌లో పెట్టింది. అయితే జూన్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి హ్యుందాయ్ కార్లపై గరిష్టంగా రూ.12,800 వరకు భారం పడనుంది. ప్రస్తుతం హుండై సంస్థ భారత్‌లో 10 రకాల కార్ల మోడళ్లను విక్రయిస్తోంది.
ఇతర కార్ల కంపెనీల పరిస్థితి ఇదే
కేవలం మారుతి, హ్యుందాయ్ మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ప్రముఖ కార్ల సంస్థలైన టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ ఇప్పటికే గత ఏప్రిల్ నెలలోనే తమ కార్ల ధరలను పెంచేశాయి. ఇదిలా ఉంటే, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బివైడి కూడా రాబోయే జూలై 2026 నుంచి తమ వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచబోతున్నట్లు ముందే ప్రకటించింది. రానున్న రోజుల్లో మిగిలిన కంపెనీలు కూడా రేట్లు పెంచే అవకాశం ఉంది.
అసలు కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
కార్ల తయారీకి కావలసిన విడిభాగాలు, ముడిసరుకుల ధరలు మార్కెట్లో విపరీతంగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణం. వాహనాల తయారీ వ్యయం, కంపెనీ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల చాలా కాలంగా ఆ భారాన్ని కంపెనీలే భరిస్తూ వచ్చాయని సంస్థలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు భారం మరింత ఎక్కువ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అందులో కొంత భాగాన్ని ధరల పెంపు రూపంలో కస్టమర్లపై వేయాల్సి వస్తోందని కంపెనీలు వివరణ ఇచ్చాయి.

