BYD Atto 3 : రోజుకు 700+ అట్టో 3 కార్ల అమ్మకాలతో ఈవీ మార్కెట్‌లో కింగ్ అనిపించుకున్న BYD
ఈవీ మార్కెట్‌లో కింగ్ అనిపించుకున్న BYD

BYD Atto 3 : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఈ క్రమంలో చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD మరో మైలురాయిని అధిగమించింది. కంపెనీకి చెందిన మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BYD అట్టో 3, ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ అమ్మకాల మార్కును చేరుకుంది. చైనాలో ఈ మోడల్‌ను యువాన్ ప్లస్ పేరుతో పిలుస్తారు. దీనిని మొదట ఫిబ్రవరి 2022లో మార్కెట్‌లోకి విడుదల చేశారు.
BYD అట్టో 3 ప్రారంభ విజయం చైనా మార్కెట్ నుంచే మొదలైంది. అక్కడ తొలి 14 నెలల్లోనే దాదాపు 3 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత ఆరు నెలల్లో మరో 2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని తర్వాత కంపెనీ తమ ఎగుమతులను వేగవంతం చేసి, ఈ కారును 100 కంటే ఎక్కువ దేశాలకు పంపింది. ఈ మొత్తం కాలంలో రోజుకు సగటున 719 యూనిట్లు అమ్ముడయ్యాయి. అట్టో 3 కేవలం 1,391 రోజుల్లోనే 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుంది. అయితే, కంపెనీ ఇప్పటివరకు వివిధ దేశాల వారీగా అమ్మకాల వివరాలను ప్రకటించలేదు.
BYD అట్టో 3 ధర చైనాలో సుమారు రూ.13.97 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక భారతదేశంలో దీనిని నవంబర్ 2022లో విడుదల చేశారు. ఇక్కడ దీని ప్రారంభ ధర రూ.24.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ మోడల్‌కు స్థానికంగా ఉత్పత్తి లేదు, అందుకే ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.
భారతదేశంలో వేరియంట్ల ధరలు డైనమిక్ రూ.24.99 లక్షలు, ప్రీమియం రూ.29.85 లక్షలు, సుపీరియర్ రూ.33.99 లక్షలు. BYD అట్టో 3 రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మొదటిది 49.92 kWh బ్యాటరీ, ఇది 468 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. రెండోది 60.48 kWh బ్యాటరీ, దీని గరిష్ట రేంజ్ 521 కి.మీ. వరకు ఉంటుంది.
డైనమిక్ వేరియంట్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ హోలోగ్రాఫిక్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఇందులో యాంబియంట్ లైటింగ్, లెవల్ 2 ఏడిఏఎస్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ వంటి ప్రీమియం సౌకర్యాలు ఉండవు. ప్రీమియం వేరియంట్‌లో ఈ బేసిక్ ఫీచర్లతో పాటు అడాప్టివ్ హెడ్‌లైట్స్ కూడా ఉంటాయి. సుపీరియర్ వేరియంట్ అత్యంత అధునాతనమైనది. ఇందులో 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, ఏడిఏఎస్ లెవల్ 2, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ వంటి అన్ని ఫీచర్లు ఉంటాయి, ఇవి ప్రీమియం డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఈ అమ్మకాల రికార్డుతో BYD, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
