BYD : జపాన్‌లో చరిత్ర సృష్టించనున్న చైనా కారు.. చిన్న కస్టమర్ల కోసం బీవైడీ మెగా ప్లాన్
చిన్న కస్టమర్ల కోసం బీవైడీ మెగా ప్లాన్

BYD : చైనాకు చెందిన అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ, తన దృష్టిని లగ్జరీ విభాగం నుంచి చిన్న కార్ల మార్కెట్‌పైకి మళ్లించింది. ఇప్పటికే భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ, ఊహించని విధంగా జపాన్‌లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కేయీ కారు (Kei Car)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త మోడల్ జపాన్ మార్కెట్‌లో విడుదలైన మొట్టమొదటి విదేశీ-తయారీ ఎలక్ట్రిక్ కేయీ కారుగా చరిత్ర సృష్టించనుంది. ప్రత్యేకంగా జపాన్ రోడ్ల కోసం డిజైన్ చేయబడిన ఈ బీవైడీ కేయీ కారు ఫీచర్లు, రేంజ్, అంచనా ధర వివరాలు ఇప్పుడు చూద్దాం.
చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ, జపాన్‌లోని చిన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కేయీ కార్ల విభాగంలోకి ప్రవేశించనుంది. జపాన్‌లో కేయీ కార్లు చాలా ప్రజాదరణ పొందాయి. బీవైడీ తీసుకువస్తున్న ఈ కొత్త మోడల్ జపాన్‌లో విడుదలైన మొదటి విదేశీ-తయారీ ఎలక్ట్రిక్ కేయీ కారుగా గుర్తింపు పొందనుంది. స్పై ఫోటోలలో ఈ కారు పొడవుగా, బాక్సీ ఆకారంలో కనిపిస్తుంది. ఇది కారు లోపల స్థలాన్ని గరిష్టంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేసింది. దీనికి దీర్ఘచతురస్రాకార లైటింగ్ ఎలిమెంట్‌లు, ఫ్లాట్ ఫ్రంట్ ఫేసియా, చిన్న బోనెట్ ఉన్నాయి.
బీవైడీ కేయీ కారు ప్రత్యేకించి పట్టణ వినియోగానికి అనుగుణంగా ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారులో ఫ్లాట్ రూఫ్, డబుల్ ఏ-పిల్లర్, స్కైర్ విండోలు, కిటికీలు, వీల్ ఆర్చ్‌లు ఉన్నాయి. వెనుక ఫెండర్ పైన కనిపిస్తున్న క్రావింగ్ స్లైడింగ్ డోర్ రైల్ ట్రాక్ ఉండవచ్చని సూచిస్తుంది. స్లైడింగ్ డోర్‌లు సులభంగా లోపలికి ప్రవేశించడానికి, బయటకు రావడానికి, అలాగే పెద్ద సామాను లోడ్ చేయడానికి ఉపయోగపడతాయి.
కారు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా, ఓవర్‌హాంగ్‌లు చిన్నవిగా ఉన్నాయి. వీల్స్ అంచుల వద్ద ఉండటం వల్ల కేబిన్ స్పేస్ పెరిగే అవకాశం ఉంది. వెనుక భాగంలో ఫ్లాట్ విండ్‌షీల్డ్, పైకి అమర్చిన వైపర్ ఉన్నాయి. ఈజీ యాక్సెస్ కోసం ఈ కారు వెనుక బూట్ లిడ్ విశాలంగా ఓపెన్ అయ్యే విధంగా ఉంటుంది. వెనుక సీట్లను మడవడం ద్వారా రకరకాల వస్తువులను, సామాన్లను ఉంచుకోవచ్చు.
బీవైడీ కేయీ కారు టెక్నికల్, ధర వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, కొన్ని అంచనాలు ఉన్నాయి. ఈ కారులో 20-kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. డబ్ల్యూఎల్‌టీసీ ప్రమాణాల ప్రకారం, దీని రేంజ్ సుమారు 180 కిలోమీటర్లు వరకు ఉండవచ్చు. ఈ కేయీ కారు 100 kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారు పోటీ ధర ట్యాగ్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర సుమారు 2.5 మిలియన్ జపనీస్ యెన్ (భారత కరెన్సీలో సుమారు రూ.14.38 లక్షలు) ఉండే అవకాశం ఉంది.

