BYD : బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ లోపం..వెనక్కి పిలుస్తున్న కంపెనీ, ఫ్రీగా కొత్త బ్యాటరీ
వెనక్కి పిలుస్తున్న కంపెనీ, ఫ్రీగా కొత్త బ్యాటరీ

BYD : చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ, భారత్‌లో తన ప్రతిష్టాత్మక సెడాన్ సీల్ విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కారులో అమర్చిన హై-వోల్టేజ్ బ్లేడ్ బ్యాటరీలోని కొన్ని సెల్స్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. దీనివల్ల భవిష్యత్తులో వాహనం ఆగిపోవడం లేదా ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భావించిన బీవైడీ, స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. అంటే, లోపం ఉన్న కార్లను గుర్తించి వాటికి ఉచితంగా సర్వీసింగ్ చేయనుంది.
మీరు మీ బీవైడీ సీల్ కారును అధికారిక సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లినప్పుడు, అక్కడి టెక్నీషియన్లు కారుకు OBD (On-Board Diagnostics) పరీక్ష చేస్తారు. స్కానర్ సాయంతో బ్యాటరీ సెల్స్ పనితీరును పరిశీలిస్తారు. ఒకవేళ ఆ పరీక్షలో బ్యాటరీలో ఏవైనా లోపాలు ఉన్నట్లు తేలితే, ఏమాత్రం ఆలోచించకుండా పూర్తి బ్యాటరీ ప్యాక్‌ను ఉచితంగా మార్చేస్తారు. కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, ఒకవేళ మీరు కారును స్వయంగా సర్వీస్ సెంటర్‌కు తీసుకురాలేని పక్షంలో, కంపెనీ ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి కారును తీసుకెళ్లి రిపేర్ తర్వాత మళ్ళీ అప్పగిస్తారు.
కంపెనీ ప్రతినిధుల సమాచారం ప్రకారం.. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ అవసరమైతే, ఆ పనిని పూర్తి చేసి అదే రోజున కారును కస్టమర్‌కు తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కస్టమర్లు తమకు వీలున్న రోజున (ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం మధ్య) అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని కంపెనీ కోరుతోంది. ఈ రీకాల్ కేవలం సీల్ మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. బీవైడీ విక్రయిస్తున్న ఇతర మోడల్స్ అయిన అట్టో 3 లేదా ఈ-6 (e6) వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.
బీవైడీ సీల్ కారు ప్రస్తుతం ఇండియాలో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తోంది. ఒకటి 61.44kWh బ్యాటరీ కాగా, మరొకటి 82.56kWh బ్యాటరీ. ఇది డైనమిక్, ప్రీమియం, పర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అత్యాధునిక డిజైన్, అద్భుతమైన రేంజ్‌తో టెస్లాకు గట్టి పోటీ ఇస్తున్న ఈ కారు విషయంలో, కంపెనీ ఇంత త్వరగా స్పందించి లోపాన్ని సరిదిద్దడం గమనార్హం. ఇలాంటి సాంకేతిక లోపాలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో అప్పుడప్పుడు సహజమే అయినప్పటికీ, భద్రత విషయంలో రాజీ పడకుండా కంపెనీ ఉచితంగా బ్యాటరీ మార్చడం పట్ల కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

