Car Coolant : కారు ఇంజిన్ సురక్షితంగా, సుదీర్ఘ కాలం పాటు మెరుగ్గా పనిచేయడంలో కూలెంట్ పాత్ర అత్యంత కీలకమైనది. ఇది ఇంజిన్ ఉష్ణోగ్రతను నియంత్రించి, తీవ్రమైన వేడి వల్ల ఇంజిన్ భాగాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అయితే చాలామంది వాహనదారులు కూలెంట్ మార్చే సమయంలో లేదా టాప్-అప్ చేసే సమయంలో తీవ్రమైన పొరపాట్లు చేస్తుంటారు. మార్కెట్లో లభించే ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు వంటి రకరకాల రంగుల కూలెంట్లలో ఏదో ఒకదానిని కలపడం వల్ల ఇంజిన్‌కు ఎంతటి నష్టం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కూలెంట్ల రంగుల వెనుక ఉన్న కెమికల్ సైన్స్

చాలామంది కూలెంట్ రంగు కేవలం గుర్తు పట్టడానికి లేదా అందం కోసం మాత్రమే అనుకుంటారు, కానీ అందులో నిజం లేదు. కూలెంట్ రంగు దాని రసాయన సాంకేతికతను సూచిస్తుంది

* ఆకుపచ్చ కూలెంట్ : సాధారణంగా పాతతరం మోడళ్లలో, కాస్ట్ ఐరన్ ఇంజిన్ బ్లాకుల్లో సిలికేట్లు, ఫాస్ఫేట్లతో కూడిన ఈ ఐఏటీ కూలెంట్‌ను ఉపయోగిస్తారు. ఇది ప్రతి 2 ఏళ్లకు లేదా 50,000 కిలోమీటర్లకు మార్చాల్సి ఉంటుంది.

* ఎరుపు / గులాబీ కూలెంట్ : ఇది అల్యూమినియం రేడియేటర్లు, ఆధునిక ఇంజిన్ల కోసం రూపొందించబడింది. కార్బాక్సిలేట్ కాంపౌండ్లతో తయారయ్యే ఈ ఓఏటీ కూలెంట్ దాదాపు 5 ఏళ్లు లేదా 1,50,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది.

* నీలం / పసుపు కూలెంట్ : ఇది ఐఏటీ, ఓఏటీల సమ్మేళనం. బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, టోయోటా వంటి లగ్జరీ మరియు ఆసియా కార్లలో తుప్పు పట్టకుండా, తీవ్రమైన వేడి నుంచి కాపాడటానికి హైబ్రిడ్ సాంకేతికతతో కూడిన ఈ కూలెంట్‌ను ఎక్కువగా వాడతారు.

రంగులు కలిపితే ఏమవుతుంది?

వేర్వేరు రంగులు ఉన్న కూలెంట్లను ఒకదానితో ఒకటి కలిపి ఉపయోగిస్తే వాటిలోని రసాయనాలు పరస్పరం చర్య జరిపి వికటిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ (IAT), ఎరుపు (OAT) కూలెంట్లను కలిపినప్పుడు, ఆ ద్రవం రసాయన ప్రక్రియ వల్ల చిక్కటి జెల్ లేదా స్లడ్జ్ (పేస్ట్) లాగా మారిపోతుంది. ఈ పేస్ట్ రేడియేటర్ గొట్టాలు, వాటర్ పంప్, కూలింగ్ జాకెట్లలో పేరుకుపోయి నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. ఫలితంగా ఇంజిన్ ఓవర్ హీట్ అయి, సిలిండర్ హెడ్ దెబ్బతినడం, హెడ్ గ్యాస్కెట్ కాలడం వంటి రూ. 50,000 పైగా ఖరీదైన మరమ్మతులకు దారితీస్తుంది.

కొత్త కూలెంట్ వేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు

* యూజర్ మ్యాన్యువల్ చూడండి: మీ కారు తయారీ సంస్థ ఏ రకం, ఏ రంగు కూలెంట్‌ను సిఫార్సు చేసిందో మీ వాహన ఓనర్స్ మ్యాన్యువల్‎లో స్పష్టంగా ఉంటుంది. అదే రకం కూలెంట్‌ను మాత్రమే వాడాలి.

* ఫ్లషింగ్ తప్పనిసరి: ఒకవేళ మీ కారులో కూలెంట్ రకం మార్చాలనుకుంటే, లేదా పాత కూలెంట్ ఏదో తెలియకపోతే.. ముందుగా పాత కూలెంట్‌ను పూర్తిగా తీసేసి, డిస్టిల్డ్ వాటర్‌తో కూలింగ్ సిస్టమ్‌ను క్లీన్ చేసిన తర్వాతే కొత్త కూలెంట్ పోయాలి.

* సాధారణ నీరు వద్దే వద్దు: అత్యవసర సమయంలో మినహా సాధారణ ప్లాస్టిక్ లేదా టాప్ వాటర్ వాడకూడదు. నీటిలోని లవణాలు ఇంజిన్‌లో తుప్పు ఏర్పడేలా చేస్తాయి. కూలెంట్ దట్టంగా ఉన్నప్పుడు కేవలం డిస్టిల్డ్ వాటర్ మాత్రమే కలపాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story