Summer Tips : ఏసీ ఆన్ చేస్తే మీ కారు పెట్రోల్ తాగేస్తుందా? గంటకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
గంటకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Summer Tips : వేసవి కాలంలో బయట అడుగుపెట్టాలంటేనే భయం వేస్తుంది. అగ్నిగుండంలా మారుతున్న ఎండల నుంచి తప్పించుకోవడానికి కారులో ఏసీ (AC) అనేది ఇప్పుడు విలాసం కాదు, కనీస అవసరం. అయితే, ఏసీ ఆన్ చేయగానే చాలామందికి మైలేజీ ఏమైపోతుందో అని ఒకటే టెన్షన్. పెట్రోల్ ధరలు చూస్తేనేమో మండిపోతున్నాయి. అసలు కారు ఏసీని ఒక గంట సేపు ఆన్ చేస్తే ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది? మైలేజీపై ఎంత ప్రభావం పడుతుంది? ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం.
గంటకు ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది?
కారు ఏసీ ఎంత పెట్రోల్ తాగుతుంది అనేది ప్రధానంగా మీ కారు ఇంజిన్ కెపాసిటీ, కారు మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 1.2 లీటర్ల నుంచి 1.5 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం గల హ్యాచ్బ్యాక్ లేదా సెడాన్ కార్లలో ఒక గంట పాటు ఏసీ వాడితే దాదాపు 0.2 నుంచి 0.4 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది. అదే మీరు 2.0 లీటర్లు లేదా అంతకంటే పెద్ద ఇంజిన్ ఉన్న ఎస్యూవీ వాడుతుంటే, గంటకు 0.5 నుంచి 0.7 లీటర్ల వరకు పెట్రోల్ అవసరం కావచ్చు. అయితే ఇది ట్రాఫిక్ పరిస్థితులు, బయట ఉన్న ఉష్ణోగ్రతను బట్టి మారుతుంటుంది.
ఏసీ మైలేజీని ఎలా తగ్గిస్తుంది?
కారులో ఏసీ ఆన్ చేసినప్పుడు, ఇంజిన్ మీద అదనపు భారం పడుతుంది. ఏసీ కంప్రెషర్ పని చేయడానికి ఇంజిన్ శక్తిని వాడుకోవాల్సి రావడమే దీనికి కారణం. నిపుణుల అంచనా ప్రకారం.. ఏసీ వాడటం వల్ల కారు మైలేజీ సుమారు 5 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మీరు హైవేపై వెళ్తున్నప్పుడు కిటికీలు క్లోజ్ చేసి ఏసీ వేయడమే మంచిది. ఎందుకంటే కిటికీలు తెరిచి వేగంగా వెళ్లడం వల్ల గాలి రాపిడి పెరిగి, ఏసీ వాడటం కంటే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది.
మైలేజీ పెరగడానికి, పెట్రోల్ ఆదా చేయడానికి చిట్కాలు:
* ముందుగా వేడి గాలిని బయటకు పంపండి: కారు ఎండలో పార్క్ చేసినప్పుడు లోపల వేడి గాలి నిండిపోతుంది. కారు స్టార్ట్ చేయగానే ఏసీ వేయకుండా, ముందుగా కిటికీలు దించి లోపల వేడిని బయటకు పంపండి. ఆ తర్వాత ఏసీ ఆన్ చేస్తే కారు త్వరగా చల్లబడుతుంది.
* రీ-సర్క్యులేషన్ మోడ్ : ఎల్లప్పుడూ ఏసీని రీ-సర్క్యులేషన్ మోడ్లో ఉంచండి. దీనివల్ల బయట ఉన్న వేడి గాలి లోపలికి రాదు, లోపల ఉన్న చల్లని గాలినే ఏసీ వాడుకుంటుంది. దీనివల్ల కంప్రెషర్పై లోడ్ తగ్గుతుంది.
* ఛాయలో పార్క్ చేయండి: కారును వీలైనంత వరకు నీడలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి లేదా సన్షేడ్స్ వాడండి. కారు లోపల వేడి తక్కువగా ఉంటే, ఏసీ తక్కువ సమయంలోనే కూలింగ్ ఇస్తుంది.
* ఏసీ సర్వీసింగ్ మర్చిపోకండి: కారు ఏసీ ఫిల్టర్లు గలీజుగా ఉన్నా లేదా ఏసీ గ్యాస్ తక్కువగా ఉన్నా కూలింగ్ సరిగ్గా రాదు. దీనివల్ల ఇంజిన్ ఎక్కువ సేపు కష్టపడాల్సి వస్తుంది, ఫలితంగా పెట్రోల్ వృధా అవుతుంది. కాబట్టి ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి ఏసీ సిస్టమ్ చెక్ చేయించడం మంచిది. ఏసీని ఎప్పుడూ ఫుల్ స్పీడ్ లో కాకుండా మోడరేట్ మోడ్ లో ఉంచడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది.

