Car AC Mileage : వేసవి కాలంలో కారులో ప్రయాణించేటప్పుడు ఏసీ ఆన్ చేయకపోతే అసలు ప్రయాణమే నరకంలా మారుతుంది. బయట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోతున్నప్పుడు కారు ఏసీ మనకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే, ఏసీ ఆన్ చేసి హాయిగా ప్రయాణించే చాలామంది వాహనదారుల మనసులో ఒక సందేహం ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. అదేంటంటే.. కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుందా? మైలేజ్ బాగా తగ్గిపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే చెప్పాలి. కానీ చాలామంది అనుకునేంత భారీ స్థాయిలో ఏసీ వల్ల నష్టం జరగదు. అసలు కారు ఏసీ పనిచేసేటప్పుడు ఇంధనం ఎందుకు ఎక్కువ ఖర్చవుతుంది, మైలేజ్ ఎంత తగ్గుతుంది అనే పూర్తి వివరాలు చూద్దాం.

ఇంజన్‌పై పడే అదనపు భారం

నిజానికి కారు ఏసీ పనిచేయడానికి కావలసిన పవర్ నేరుగా కారు ఇంజన్ నుంచే అందుతుంది. మీరు కారులో ఏసీ స్విచ్ ఆన్ చేయగానే, దాని కంప్రెషర్ పనిచేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల కారు ఇంజన్‌పై అదనపు భారం పెరుగుతుంది. ఈ అదనపు భారాన్ని మోస్తూ కారును ముందుకు నడపడానికి ఇంజన్ సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా కారులో ఇంధన వినియోగం (పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చు) ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది.

ఏసీ వల్ల మైలేజ్ ఎంత శాతం తగ్గుతుంది?

మీడియా నివేదికల ప్రకారం, కారులో ఏసీని నిరంతరాయంగా ఉపయోగించడం వల్ల కారు మైలేజ్ సుమారు 5 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు.. మీ కారు సాధారణ పరిస్థితుల్లో (ఏసీ లేకుండా) లీటర్ పెట్రోల్‌కు 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనుకుంటే, అదే కారు ఏసీ ఆన్ చేసినప్పుడు లీటరుకు 15 నుంచి 17 కిలోమీటర్ల మధ్య మాత్రమే మైలేజ్ ఇవ్వగలదు. అయితే, ఈ మైలేజ్ తగ్గుదల అనేది అన్ని కార్లలో ఒకేలా ఉండదు. కారు ఇంజన్ సామర్థ్యం, వాహనం బరువు, బయట ఉండే వేడి, మీ డ్రైవింగ్ శైలిని బట్టి మైలేజ్‌లో మార్పులు ఉంటాయి.

సిటీ ట్రాఫిక్ వర్సెస్ హైవే.. ఏసీ ప్రభావం ఎక్కడ ఎక్కువ?

కారు ఏసీ ప్రభావం మనం ప్రయాణించే రోడ్లను బట్టి కూడా మారుతుంది:

* సిటీ భారీ ట్రాఫిక్: మీరు నగరంలోని భారీ ట్రాఫిక్‌లో కారు నడుపుతుంటే ఏసీ వల్ల మైలేజ్ చాలా ఎక్కువగా తగ్గిపోతుంది. ట్రాఫిక్‌లో కారును పదే పదే ఆపడం, బ్రేకులు వేయడం, మళ్లీ ఫస్ట్ గేర్ వేసి ముందుకు కదపడం వల్ల ఇంజన్‌పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఇంధనం చాలా వేగంగా కరిగిపోతుంది.

* హైవే ప్రయాణం: అదే మీరు హైవేపై ఒకే నిర్దిష్ట వేగంతో (కాన్‌స్టెంట్ స్పీడ్) కారును లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తే ఏసీ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. హైవేపై ఇంజన్ ఫ్రీగా రన్ అవ్వడం వల్ల ఫ్యూయల్ వినియోగం అంత వేగంగా పెరగదు.

ఏసీ వాడుతూనే పెట్రోల్ ఆదా చేయడం ఎలా?

కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వేసవిలో ఏసీ వాడుకుంటూనే కారు మైలేజ్ తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు:

* వేడి గాలిని బయటకు పంపండి: ఎండలో పార్క్ చేసిన కారు ఎక్కగానే వెంటనే ఏసీని ఫుల్ స్పీడ్‌లో ఆన్ చేయకూడదు. ముందుగా కారు కిటికీలన్నీ తెరిచి లోపల ఉన్న వేడి గాలిని బయటకు వెళ్లనివ్వాలి. ఆ తర్వాత ఏసీ ఆన్ చేస్తే కేబిన్ త్వరగా చల్లబడుతుంది. ఏసీ కంప్రెషర్‌పై లోడ్ తగ్గుతుంది.

* ఏసీ ఫిల్టర్ క్లీనింగ్: కారు ఏసీ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం లేదా సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. ఫిల్టర్ మురికిగా ఉంటే ఏసీ కూలింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది, దీనివల్ల కేబిన్ చల్లబడటానికి ఎక్కువ టైమ్ పట్టి ఫ్యూయల్ వినియోగం పెరుగుతుంది.

* స్మూత్ డ్రైవింగ్ అలవాటు చేసుకోండి: కారును ఒక్కసారిగా అతి వేగంగా యాక్సిలరేట్ చేయడం లేదా సడన్ బ్రేకులు వేయడం వంటివి చేయకూడదు. స్మూత్‌గా డ్రైవ్ చేయడం వల్ల కారు సురక్షితంగా ఉండటమే కాకుండా మైలేజ్ కూడా అద్భుతంగా పెరుగుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story