Car AC Cooling Tips : ఎండలు మండిపోతున్నాయి.. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఏసీ సరిగ్గా పని చేయకపోతే ఆ నరకం వర్ణనాతీతం. ఏసీ నుంచి చల్లటి గాలి రాకపోతే చాలామంది వెంటనే గ్యాస్ అయిపోయింది అని ఫిక్స్ అయిపోతారు. కానీ ప్రతిసారీ గ్యాస్ సమస్యే ఉండదు. ఒక్కోసారి చిన్న ఫిల్టర్ మార్చినా లేదా దుమ్ము శుభ్రం చేసినా ఏసీ మళ్ళీ కొత్తదానిలా పని చేస్తుంది. మీ కారు ఏసీ కూలింగ్ తగ్గడానికి గల ప్రధాన కారణాలు, వాటిని ఎలా గుర్తించాలో వివరంగా తెలుసుకుందాం.

ఏసీ గ్యాస్ లీకేజీ..

కారు ఏసీ సిస్టమ్ అనేది ఒక మూసి ఉన్న గొట్టం లాంటిది. ఇందులో గ్యాస్ అనేది దానంతట అది అయిపోదు. ఒకవేళ గ్యాస్ తగ్గిందంటే ఎక్కడో ఒక చోట లీక్ ఉందని అర్థం. పైపుల జాయింట్లు, రబ్బర్ సీల్స్ లేదా కంప్రెసర్ పార్ట్స్ దగ్గర చిన్నపాటి పగుళ్లు రావడం వల్ల గ్యాస్ బయటకు పోతుంది. ఇలాంటప్పుడు గ్యాస్ నింపడమే కాకుండా, ఆ లీకేజీ ఎక్కడ ఉందో కనిపెట్టి దాన్ని క్లోజ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే మళ్ళీ వారం రోజుల్లోనే ఏసీ వేడెక్కుతుంది.

కంప్రెసర్

ఏసీ సిస్టమ్‌లో కంప్రెసర్ చాలా కీలకమైనది. ఇది గ్యాస్‌ను మొత్తం సిస్టమ్‌లో తిప్పుతుంది. ఒకవేళ కంప్రెసర్ క్లచ్ పాడైపోయినా లేదా బెల్ట్ వదులైనా ఏసీ పని చేయదు. ఏసీ ఆన్ చేసినప్పుడు కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయంటే కంప్రెసర్ ఇబ్బందిలో ఉందని గుర్తుంచుకోవాలి. ఇది పాడైతే మాత్రం రిపేర్ ఖర్చు కొంచెం భారంగానే ఉంటుంది. అందుకే ఏసీ నుంచి సౌండ్ వస్తున్నప్పుడే మెకానిక్‌ను సంప్రదించడం ఉత్తమం.

కండెన్సర్ బ్లాక్ అయిందా?

కారు ముందు భాగంలో రేడియేటర్ పక్కనే కండెన్సర్ ఉంటుంది. దీని పని లోపలి వేడి గాలిని బయటకు పంపడం. రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు దుమ్ము, ధూళి, పురుగులు దీనికి అంటుకుపోయి గాలి ప్రసరణను అడ్డుకుంటాయి. కండెన్సర్ పైన మురికి పేరుకుపోతే ఏసీ సరిగ్గా గాలిని చల్లబరచలేదు. కేవలం ప్రెజర్ వాటర్‌తో దీన్ని క్లీన్ చేస్తే చాలు, ఏసీ కూలింగ్ పెరగడం మీరు గమనించవచ్చు.

క్యాబిన్ ఫిల్టర్ మార్చారా?

చాలా మంది మర్చిపోయే అతి చిన్న విషయం క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్. గ్లోవ్ బాక్స్ వెనుక ఉండే ఈ ఫిల్టర్ దుమ్మును ఆపుతుంది. ఇది పూర్తిగా జామ్ అయిపోతే ఏసీ నుంచి గాలి ఫ్లో తగ్గిపోతుంది. ఫిల్టర్ గందరగోళంగా ఉంటే ఏసీ ఆన్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి లేదా వేసవి ప్రారంభంలో ఈ ఫిల్టర్ మార్చుకుంటే ఏసీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే ఫ్యాన్ మోటార్, సెన్సార్లు, ఫ్యూజ్‌లలో సమస్యలు ఉన్నా కూలింగ్ దెబ్బతింటుంది.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story