Car Buying Tips: కొత్త కారు కొనడం ప్రతిఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. షోరూమ్‌లో వారు చెప్పిన ధరకు వెంటనే ఓకే చెప్పేస్తే మీ జేబుకు భారీగా చిల్లు పడటం ఖాయం. డీలర్‌తో కొంచెం తెలివిగా మాట్లాడి, సరైన ఆఫర్లు అడిగితే వేలాది రూపాయలు సులువుగా ఆదా చేసుకోవచ్చు. ఈ సీక్రెట్ చిట్కాలేంటో చూద్దాం.

షోరూమ్‌లో అదనపు డిస్కౌంట్లు డిమాండ్ చేయండి

కారు ధరకు సంబంధించి డీలర్ మొదట చెప్పే డిస్కౌంట్‌తో ఎప్పుడూ సంతృప్తి పడకూడదు. కంపెనీ ఇచ్చే ఆఫర్లతో పాటు డీలర్ తన సొంత మార్జిన్ నుంచి ఇచ్చే అదనపు తగ్గింపు గురించి స్పష్టంగా అడగాలి. ముఖ్యంగా షోరూమ్‌లో ఎక్కువ రోజులుగా నిల్వ ఉన్న మోడళ్లు లేదా తక్కువ డిమాండ్ ఉన్న వేరియంట్లపై డీలర్లు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ విషయంలో కొంచెం పట్టుబడితే భారీగా లబ్ధి పొందవచ్చు.

పాత కారు ఉంటే ఆఫర్ల పండగే

మీ దగ్గర ఇప్పటికే ఏదైనా కారు ఉండి, అదే బ్రాండ్‌కు చెందిన కొత్త వాహనం కొంటుంటే కంపెనీలు ప్రత్యేకంగా లాయల్టీ బోనస్ అందిస్తాయి. ఒకవేళ పాత కారును ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే, ముందుగా బయటి మార్కెట్లో దాని అసలు విలువ ఎంతో తెలుసుకోవడం మంచిది. అంతేకాకుండా, మీరు ఉద్యోగం చేసే సంస్థను బట్టి కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. క్యాష్ పేమెంట్ ప్రాతిపదికన కొనుగోలు చేస్తుంటే ప్రత్యేక ఆఫర్లు అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం.

ఇన్సూరెన్స్ బయటే తీసుకోండి

కారు కొనుగోలులో ప్రధానంగా ఖర్చయ్యేది ఇన్సూరెన్స్ ప్రీమియం. డీలర్లు చెప్పే మోటార్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలు చాలా ప్రియంగా ఉంటాయి. కంపెనీ ఇన్సూరెన్స్ కోట్ తీసుకుని బయటి ఏజెంట్లు లేదా ఆన్‌లైన్ పోర్టల్స్‌లో లభించే రేట్లతో పోల్చి చూడాలి. బయట తక్కువకు లభిస్తే అదే ఇన్సూరెన్స్‌ను మ్యాచ్ చేయమని డీలర్‌ను కోరవచ్చు. ఒక్క డీలర్‌తోనే కాకుండా నగరంలోని రెండు మూడు షోరూమ్‌లను సందర్శించి ఆఫర్లను పోల్చడం ద్వారా బెస్ట్ డీల్ సొంతం చేసుకోవచ్చు.

తక్కువ డిమాండ్ ఉన్న కలర్స్

కార్లలో కొన్ని రంగులకు విపరీతమైన క్రేజ్ ఉంటే, మరికొన్ని రంగులను కస్టమర్లు పెద్దగా ఇష్టపడరు. రంగుతో మీకు పెద్దగా పట్టింపు లేకపోతే స్టాక్‌లో ఉన్న తక్కువ డిమాండ్ ఉన్న కలర్ వేరియంట్‌ను ఎంచుకుని గట్టిగా బేరం ఆడవచ్చు. అలాగే ఏడాది చివర్లో (డిసెంబర్) లేదా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలలో డీలర్లు తమ ఇయర్ ఎండ్ స్టాక్ క్లియర్ చేయడానికి, సేల్స్ టార్గెట్స్ పూర్తి చేయడానికి మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఆ సమయంలో కొనుగోలు చేస్తే గరిష్ట ప్రయోజనం పొందవచ్చు.

Next Story