Car Care Tips : వర్షాకాలం, తేమతో కూడిన వాతావరణంలో కారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య అద్దాలపై పొగమంచు పేరుకుపోవడం. కారులో ఏసీ ఆన్ చేయగానే ముందు వైపు ఉండే విండ్‌షీల్డ్, అలాగే సైడ్ అద్దాలు, వెనుక అద్దం మసకబారిపోతాయి. దీనివల్ల బయట ఉండే రోడ్డు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతుంది. అయితే ఆధునిక కార్లలో ఉండే ఒక చిన్న ఫీచర్ ద్వారా ఈ సమస్యను చాలా సులభంగా, వేగంగా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కారు అద్దాలపై అసలు మంచు ఎందుకు పేరుకుపోతుంది?

వర్షం పడుతున్నప్పుడు లేదా బయట వాతావరణం చాలా తేమగా ఉన్నప్పుడు కారు లోపల ఏసీ ఆన్ చేస్తే కారు లోపలి ఉష్ణోగ్రత చల్లబడుతుంది. బయట ఉష్ణోగ్రత వేడిగా లేదా తేమగా ఉండటం వల్ల లోపల, బయటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది. ఈ ఉష్ణోగ్రత తేడా వల్లే కారు అద్దాల బయటి వైపు లేదా లోపలి వైపు నీటి ఆవిరి పేరుకుపోయి దట్టమైన పొగమంచులా మారుతుంది. ఇది డ్రైవర్‌కి విజబిలిటీని పూర్తిగా తగ్గించేస్తుంది.

డీ-ఫాగర్ ఎలా పనిచేస్తుంది?

ఈ సమస్య పరిష్కారానికి కార్లలో డీ-ఫాగర్ లేదా డీఫ్రాస్టర్ అనే ఫీచర్ ఉంటుంది. మీ కారు డాష్‌బోర్డ్‌పై ఉండే డీ-ఫాగర్ బటన్ ఆన్ చేయగానే, అది విండ్‌షీల్డ్, వెనుక అద్దం వైపు వేడి లేదా పొడి గాలిని పంపుతుంది. దీనివల్ల అద్దాలపై ఉన్న తేమ క్షణాల్లో ఆవిరైపోయి రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కారు వెనుక అద్దంపై ఉండే సన్నని గీతలు నిజానికి ఎలక్ట్రిక్ హీటింగ్ ఎలిమెంట్స్. డీ-ఫాగర్ ఆన్ చేయగానే ఈ గీతలు స్వల్పంగా వేడెక్కి వెనుక అద్దంపై ఉన్న మంచును త్వరితగతిన తొలగిస్తాయి.

మీ కారులో డీ-ఫాగర్ లేకపోతే ఏం చేయాలి?

ఒకవేళ మీ కారులో డీ-ఫాగర్ ఫీచర్ లేనట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏసీ ఉష్ణోగ్రతను కొద్దిగా పెంచాలి. అలాగే రీ-సర్క్యులేషన్ మోడ్‌ను తీసివేసి ఫ్రెష్ ఎయిర్ మోడ్ ని ఆన్ చేయాలి. అవసరమైతే కారు కిటికీలను కొద్దిగా క్రిందికి దించితే కారు లోపల, బయటి ఉష్ణోగ్రతలు సమానమై అద్దాలపై ఉన్న మంచు తనంతట తానే మాయమవుతుంది. వర్షంలో ప్రయాణించేటప్పుడు అద్దాలను శుభ్రంగా ఉంచుకోవడమే సురక్షిత ప్రయాణానికి తొలిమెట్టు.

PolitEnt Media

PolitEnt Media

Next Story