Car Insurance : కారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ తప్పు చేశారో.. క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం ఖాయం
క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం ఖాయం

Car Insurance : ఈ రోజుల్లో సొంతంగా ఒక కారు కొనుక్కోవడం ఎంత ముఖ్యమో.. దానికి సరైన కార్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది కారు ఇన్సూరెన్స్‌ను కేవలం ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు చూపించడానికి, చట్టపరమైన జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఒక ఫార్మాలిటీగా భావిస్తారు. కానీ నిజానికి అది ప్రమాదాలు జరిగినప్పుడు మీ ఆర్థిక భారాన్ని తగ్గించే ఒక అద్భుతమైన రక్షణ కవచం. ప్రస్తుతం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, రిపేర్ ఖర్చులను చూస్తుంటే సరైన కవరేజ్ లేకపోతే రోడ్డున పడాల్సి వస్తుంది. అయితే చాలా మంది పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. దీనివల్ల ప్రమాదం జరిగి లక్షల్లో నష్టం వచ్చినప్పుడు.. ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను రిజెక్ట్ చేస్తాయి. మరి క్లెయిమ్స్ సులభంగా రావాలంటే పాలసీ తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.
తక్కువ ప్రీమియం చూసి మోసపోకండి
చాలా మంది వాహనదారులు ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు కేవలం ప్రీమియం ఎంత తక్కువగా ఉందనే విషయంపైనే దృష్టి పెడతారు. ఏ కంపెనీ తక్కువ ధరలో ఇన్సూరెన్స్ ఇస్తే దాన్నే గుడ్డిగా తీసేసుకుంటారు. కానీ తక్కువ ధర ఉండే పాలసీలలో చాలా ముఖ్యమైన సేవలు, కవరేజీలు లోపించి ఉంటాయనే పచ్చి నిజాన్ని మర్చిపోతారు. ఉదాహరణకు.. ఇంజన్ ప్రొటెక్షన్, జీరో డెప్రిసియేషన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, కన్జ్యూమబుల్ కవర్ వంటి యాడ్-ఆన్స్ చౌక పాలసీలలో ఉండవు. ఒకవేళ మీరు ఈ కవరేజీలు లేకుండా కేవలం బేసిక్ పాలసీ తీసుకుంటే.. ప్రమాదం జరిగినప్పుడు భారీ రిపేర్ ఖర్చులన్నీ మీ సొంత జేబు నుంచే కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి పాలసీ ధరతో పాటు అందులో వచ్చే లాభాలను కూడా సరిపోల్చుకోవడం ముఖ్యం.
కంపెనీకి అబద్ధాలు చెబితే అంతే సంగతులు
పాలసీ తీసుకునే సమయంలో మీ కారుకు సంబంధించిన ప్రతి ఒక్క వివరాలను ఇన్సూరెన్స్ కంపెనీకి నిజాయితీగా చెప్పాలి. చాలా మంది ప్రీమియం అమౌంట్ తగ్గించుకోవడం కోసం లేదా ఇతర కారణాల వల్ల కారు మోడిఫికేషన్లు (అదనపు డెకరేషన్స్, సిలిండర్ అమరికలు), వాహనాన్ని దేనికోసం వాడుతున్నారు (సొంత అవసరాలకా లేదా కమర్షియల్ కా) అనే వివరాలను దాచేస్తుంటారు. ప్రమాదం జరిగిన తర్వాత కంపెనీ అధికారులు వచ్చి దర్యాప్తు చేసినప్పుడు.. మీరు తప్పుడు సమాచారం ఇచ్చారని లేదా నిజాలు దాచారని తేలితే, ఆ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీ క్లెయిమ్‌ను అక్కడికక్కడే రిజెక్ట్ చేస్తుంది. అందుకే అన్ని డాక్యుమెంట్లను, కారు కండిషన్‌ను స్పష్టంగా ఇన్సూరెన్స్ కంపెనీతో షేర్ చేసుకోవాలి.
ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీకి ఫోన్ చేయాలి
కారుకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది చేసే మొదటి తప్పు.. ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడం. ప్రమాదం జరిగిన వెంటనే వీలైనంత త్వరగా కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి లేదా యాప్ ద్వారా ఇన్ఫార్మ్ చేయాలి. అలా కాకుండా రోజుల తరబడి ఆలస్యం చేస్తే.. క్లెయిమ్ ప్రాసెస్ నిలిచిపోతుంది లేదా తిరస్కరించబడుతుంది. వీటికి తోడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కంపెనీలు అస్సలు క్లెయిమ్ ఇవ్వవు. ఉదాహరణకు.. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉండటం (నైట్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్), డ్రైవర్‌కు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, లేదా ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసిపోయి సకాలంలో రిన్యూ చేయకపోవడం వంటివి జరిగితే క్లెయిమ్ ఏమాత్రం చెల్లదు.
ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లకే వెళ్లండి
చిన్నపాటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది కారును నేరుగా లోకల్ ఏరియాలో ఉండే చిన్న చిన్న అన్-రిజిస్టర్డ్ గ్యారేజీలకు తీసుకెళ్లి రిపేర్ చేయించేస్తుంటారు. ఆ తర్వాత ఆ బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీకి పంపి డబ్బులు క్లెయిమ్ చేయాలని చూస్తారు. కానీ చాలా కంపెనీలు ఇలాంటి లోకల్ గ్యారేజీల రిపేర్ ఖర్చులను కవర్ చేయవు. అందుకే ప్రమాదం జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా గుర్తింపు పొందిన ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వాహనాన్ని తీసుకెళ్లాలి. అక్కడైతే క్యాష్‌లెస్ (డబ్బులు కట్టాల్సిన అవసరం లేని) సదుపాయం కూడా ఉంటుంది. కారు ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. అందులో ఉండే కఠినమైన నిబంధనలు, షరతులను పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.

