Car Maintenance : సొంతంగా ఒక కారు ఉన్న ప్రతి ఒక్కరూ దాని పర్ఫార్మెన్స్ ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలని కోరుకుంటారు. కారు ఎక్కువ కాలం ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా నడవాలంటే దాన్ని టైమ్‌కి సర్వీసింగ్ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది కారు ఓనర్లు కేవలం సర్వీస్ సెంటర్ వాళ్లు ఇచ్చిన సలహాల మీదో లేదంటే వాళ్లు వేసిన బిల్లుల మీదో ఆధారపడుతుంటారు. కానీ ప్రతి కారుకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. దాని ప్రకారం ఏ భాగాన్ని ఎప్పుడు మార్చాలి, దేని లైఫ్ ఎంత అనే ప్రాథమిక విషయాలు కారు నడిపే డ్రైవర్‌కు కచ్చితంగా తెలిసి ఉండాలి. దీనివల్ల అనవసరపు ఖర్చులు తగ్గడమే కాకుండా కారు లైఫ్ కూడా పెరుగుతుంది.

ఇంజన్ ఆయిల్ ఎప్పుడు మార్చాలంటే

కారులోని అన్ని భాగాల కంటే ఇంజన్ ఆయిల్ అత్యంత కీలకమైనది. ఇది ఇంజన్ లోపల ఉండే భాగాల మధ్య ఘర్షణను తగ్గించి, ఇంజన్ వేడెక్కకుండా చూస్తుంది. సాధారణంగా మార్కెట్లో దొరికే మినరల్ ఇంజన్ ఆయిల్‌ను ప్రతి 8,000 నుంచి 10,000 కిలోమీటర్లు లేదా ఆరు నెలలకు ఒకసారి మార్చడం మంచిది. అదే మీరు క్వాలిటీ ఎక్కువగా ఉండే సింథటిక్ ఆయిల్ వాడుతుంటే.. దాన్ని 10,000 నుంచి 12,000 కిలోమీటర్లు లేదా ఏడాది వరకు వాడుకోవచ్చు. ఆయిల్ మార్చే సమయంలో ఇంజన్ లోపల ఉన్న పాత, నల్లటి ఆయిల్‌ను పూర్తిగా బయటకు తీసేసిన తర్వాతే కొత్త ఆయిల్ పోయాలి.

కారు మైలేజ్ పెంచే ఎయిర్ ఫిల్టర్

మనం పీల్చే గాలి ఎంత శుభ్రంగా ఉండాలో, కారు ఇంజన్‌కు అందే గాలి కూడా అంతకంటే క్లీన్‌గా ఉండాలి. ఈ పనిని ఎయిర్ ఫిల్టర్ చూసుకుంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ దూళి, పొగ, కాలుష్యం ఉన్న ప్రాంతాలలో తిరుగుతుంటే.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ మార్చడం ఉత్తమం. అదే క్లీన్ ఎన్విరాన్మెంట్‌లో డ్రైవ్ చేసేవారైతే ఏడాదికి ఒకసారి మార్చినా సరిపోతుంది. ఫిల్టర్ గనుక బ్లాక్ అయిపోతే ఇంజన్‌లోకి గాలి వెళ్లడం కష్టమైపోతుంది, దీనివల్ల కారు మైలేజ్ మరియు పికప్ దారుణంగా పడిపోతాయి.

టయర్ల లైఫ్ పెంచే రొటేషన్ పద్ధతి

చాలా మంది డ్రైవర్లు టయర్ల మెయింటెనెన్స్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. కారు టయర్లు అన్నీ ఒకేలా అరిగిపోవు, ముందు వైపు ఉండే టయర్లు కాస్త త్వరగా అరుగుతాయి. అందుకే ప్రతి 8,000 నుంచి 10,000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత టయర్ రొటేషన్ (ముందు టయర్లను వెనక్కి, వెనక టయర్లను ముందుకు మార్చడం) చేయించాలి. దీనివల్ల నాలుగు టయర్లు సమానంగా అరిగి, రోడ్డుపై కారు గ్రిప్ బాగుంటుంది. ఫలితంగా టయర్ల లైఫ్ కూడా చాలా కాలం వస్తుంది.

గేర్ ఆయిల్ మరియు బ్రేక్ ప్యాడ్స్ మెయింటెనెన్స్

కారులోని గేర్ బాక్స్ స్మూత్‌గా పనిచేయడానికి గేర్ ఆయిల్ అవసరం అవుతుంది. దీనిని ఇంజన్ ఆయిల్ లాగా త్వరత్వరగా మార్చాల్సిన పనిలేదు. కారు ఎలాంటి సమస్యలు లేకుండా నడుస్తుంటే.. సాధారణంగా 50,000 నుంచి 60,000 కిలోమీటర్లు లేదా 4 నుంచి 5 సంవత్సరాల వరకు గేర్ ఆయిల్ మార్చాల్సిన అవసరం రాదు. అదే సమయంలో కారు సేఫ్టీకి అత్యంత ముఖ్యమైనవి బ్రేక్ ప్యాడ్స్. సిటీ ట్రాఫిక్‌లో ఎక్కువగా బ్రేకులు వేయడం వల్ల ఇవి త్వరగా అరిగిపోతాయి. అందుకే ప్రతి 10,000 నుంచి 20,000 కిలోమీటర్ల మధ్య ఒకసారి బ్రేక్ ప్యాడ్లను మెకానిక్‌తో చెక్ చేయించి అవసరమైతే కొత్తవి వేయించాలి.

కూలెంట్, స్పార్క్ ప్లగ్స్

ఇక కారు లాంగ్ జర్నీలలో ఉన్నప్పుడు ఇంజన్ చల్లబడటానికి ఉపయోగపడే కూలెంట్, అలాగే ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేసే స్పార్క్ ప్లగ్స్ కూడా ఎక్కువ కాలం మన్నే విడిభాగాలు. సాధారణంగా వీటిని ప్రతి 30,000 నుంచి 40,000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మార్చడం సరైన పద్ధతి. కారును కేవలం నడపడమే కాకుండా.. ఈ చిన్న చిన్న మెయింటెనెన్స్ టిప్స్ గనుక ఓనర్లు కరెక్ట్‌గా ఫాలో అయితే, మీ కారు ఎప్పటికీ కొత్తదానిలా మెరిసిపోతూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story