Car Maintenance Tips : కారు విండ్‌షీల్డ్ పగిలిందా? టెన్షన్ పడకండి.. వెంటనే ఈ పనులు చేయండి
వెంటనే ఈ పనులు చేయండి

Car Maintenance Tips : కారు నడుపుతున్నప్పుడు అకస్మాత్తుగా విండ్‌షీల్డ్ (ముందు అద్దం) పగిలితే ఎవరికైనా గుండె ఆగినంత పనవుతుంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు చిన్న రాయి వచ్చి తగిలినా లేదా వాతావరణంలో మార్పుల వల్ల అద్దంపై ఒత్తిడి పెరిగినా ఒక్కసారిగా పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇది చాలా భయంకరమైన అనుభవం. అలాంటి సమయంలో కంగారు పడకుండా, తెలివిగా వ్యవహరిస్తే పెద్ద ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
ముందుగా ఏం చేయాలి?
కారు నడుపుతున్నప్పుడు విండ్‌షీల్డ్‌పై పగుళ్లు కనిపిస్తే, మొట్టమొదట చేయాల్సింది కంగారు పడకుండా ఉండటం. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం లేదా వేగంగా కారును పక్కకు తిప్పడం వల్ల వెనుక వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. కాబట్టి, నెమ్మదిగా వేగాన్ని తగ్గించి, ఇండికేటర్లు వేసి కారును సురక్షితమైన ప్రదేశంలో లేదా రోడ్డు పక్కన ఆపండి. కారు ఆపిన తర్వాత హజార్డ్ లైట్లను ఆన్ చేయడం మర్చిపోకండి.
నష్టాన్ని అంచనా వేయండి
కారు ఆపిన తర్వాత పగులు ఎంత పెద్దదిగా ఉందో గమనించండి. ఒకవేళ ఆ పగులు సరిగ్గా డ్రైవర్ కళ్లకు ఎదురుగా ఉంటే, అది మీ చూపును అడ్డుకుంటుంది. అలాంటి స్థితిలో కారును నడపడం ఏమాత్రం క్షేమకరం కాదు. పగులు కొన్ని అంగుళాల కంటే పెద్దదిగా ఉన్నా లేదా అద్దం లోపలికి వంగినట్లు అనిపించినా రిస్క్ తీసుకోకుండా మెకానిక్‌ను లేదా టోయింగ్ సర్వీస్‌ను పిలవడం ఉత్తమం.
ఏసీ, హీటర్ల విషయంలో జాగ్రత్త
విండ్‌షీల్డ్ పగిలినప్పుడు ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు అద్దాన్ని మరింత దెబ్బతీస్తాయి. అందుకే అద్దంపై పగుళ్లు ఉన్నప్పుడు ఏసీ లేదా హీటర్‌ను అతిగా వాడకండి. అకస్మాత్తుగా వచ్చే చల్లని లేదా వేడి గాలి వల్ల అద్దం వ్యాకోచించి లేదా సంకోచించి ఆ పగులు క్షణాల్లో పెద్దదిగా మారి అద్దం మొత్తం ముక్కలయ్యే ప్రమాదం ఉంది. అలాగే కారు డోర్లను గట్టిగా వేయకండి, ఎందుకంటే ఆ ప్రకంపనలకు కూడా అద్దం పగిలిపోవచ్చు.
టెంపరరీగా ఇలా చేయొచ్చు
పగులు చాలా చిన్నదిగా ఉండి, మీరు మెకానిక్ షెడ్ వరకు వెళ్లగలిగే స్థితిలో ఉంటే.. పగులు ఉన్న చోట పైన స్పష్టంగా కనిపించే సెలైన్ టేప్ అతికించండి. దీనివల్ల ధూళి, నీరు ఆ పగులు లోపలికి వెళ్లకుండా ఉంటాయి. దీనివల్ల తర్వాత రిపేర్ చేసేటప్పుడు పని సులభమవుతుంది. అయితే ఇది కేవలం తాత్కాలికం మాత్రమేనని గుర్తుంచుకోండి.
ఇన్సూరెన్స్, రిపేర్
కారును ఆపిన వెంటనే ఆ పగులును ఫొటోలు తీయండి. ఇది మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. మీ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించి గ్లాస్ రిపేర్ సదుపాయం ఉందో లేదో కనుక్కోండి. చిన్న పగుళ్లను గ్లాస్ రిపేర్ కిట్‌తో సరిచేయవచ్చు, కానీ పగులు అంచుల్లో ఉన్నా లేదా పెద్దగా ఉన్నా అద్దాన్ని పూర్తిగా మార్చడమే మీ భద్రతకు మంచిది.

