Car Sales: దేశంలో కార్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో ఏకంగా 13.61 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి. అయితే కార్ల అమ్మకాల వృద్ధిలో కేరళ అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాదితో పోలిస్తే అక్కడ అమ్మకాలు 37 శాతం పెరిగాయి. SIAM విడుదల చేసిన రాష్ట్రాల వారీ గణాంకాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. SIAM గణాంకాల ప్రకారం.. 2026 జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా 13.61 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 30.7 శాతం పెరిగాయి. ఇందులో SUVల వాటా ఏకంగా 68 శాతంగా ఉంది. అంటే కొత్త కారు కొనాలనుకునేవారిలో ఎక్కువ మంది SUVల వైపు మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

మహారాష్ట్ర టాప్.. యూపీకి రెండో స్థానం

రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 1.65 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్త అమ్మకాల్లో ఆ రాష్ట్రం వాటా 12.1 శాతం. ఉత్తరప్రదేశ్ 9.8 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ 8.3 శాతంతో మూడో స్థానంలో ఉండగా.. తమిళనాడు 7.7 శాతం, కర్ణాటక 7.2 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో మొత్తం 4.29 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్త అమ్మకాల్లో ఈ ప్రాంతం వాటా 31.5 శాతంగా ఉంది.

కేరళలో 37 శాతం వృద్ధి

కార్ల అమ్మకాల వృద్ధిలో కేరళ ప్రత్యేకంగా నిలిచింది. 2026-27 రెండో త్రైమాసికంలో అక్కడ సుమారు 95 వేల కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 37 శాతం పెరిగాయి. దీంతో దేశవ్యాప్త కార్ల అమ్మకాల్లో కేరళ వాటా 6.7 శాతం నుంచి 7 శాతానికి చేరింది. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ 27 నుంచి 29 శాతం వరకు వృద్ధి నమోదైంది.

కేరళ, హర్యానాలో కార్లకు ఎక్కువ డిమాండ్

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కేరళ, హర్యానా రాష్ట్రాల్లో బైక్‌లతో పోలిస్తే కార్ల అమ్మకాల వాటా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్త కార్ల అమ్మకాల్లో కేరళ వాటా 7 శాతం కాగా.. టూవీలర్లలో ఆ రాష్ట్రం వాటా 3.5 శాతమే. హర్యానాలో కార్ల వాటా 6.2 శాతం ఉండగా, టూవీలర్ల వాటా 3.2 శాతంగా ఉంది. మరోవైపు ఉత్తరప్రదేశ్, బీహార్‌లో బైక్‌లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. దేశవ్యాప్త అమ్మకాల్లో యూపీ వాటా కార్లలో 9.8 శాతం, బైక్‌లలో 12.3 శాతంగా ఉంది. బీహార్‌లో కార్ల వాటా 2.1 శాతం మాత్రమే కాగా.. బైక్‌ల వాటా 4.9 శాతంగా నమోదైంది.

Next Story