Car Repair Tips : నడుస్తున్న కారు హఠాత్తుగా ఆగిపోయిందా? మెకానిక్ అవసరం లేకుండా మీరే ఇలా స్టార్ట్ చేయండి
ఇలా స్టార్ట్ చేయండి

Car Repair Tips : చాలా సార్లు మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, హఠాత్తుగా కారు లేదా బైక్ మధ్యలోనే ఆగిపోతుంటుంది. అలాంటప్పుడు చాలా మంది తీవ్రంగా కంగారు పడిపోతుంటారు. ఏం చేయాలో పాలుపోక వెంటనే మెకానిక్‌కు ఫోన్ చేసి పిలిపిస్తారు. అయితే, ప్రతిసారీ వాహనంలో పెద్ద సమస్యే ఉండాలని రూల్ లేదు. కొన్నిసార్లు చాలా చిన్న కారణాల వల్ల కూడా ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. అలాంటి చిన్న చిన్న లోపాలను మనమే కేవలం కొన్ని నిమిషాల్లో గుర్తించి సరిచేయవచ్చు. కాబట్టి ప్రయాణంలో వాహనం ఆగిపోతే అస్సలు భయపడకుండా, ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను స్వయంగా తనిఖీ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా, మెకానిక్ కోసం పెట్టే అనవసరపు ఖర్చులు కూడా మిగులుతాయి.
ఫ్యూయల్ గేజ్ రీడింగ్ నమ్మొద్దు
వాహనం ఆగిపోగానే మొదటగా మీరు చేయాల్సిన పని.. డ్యాష్‌బోర్డ్‌లో ఉన్న ఫ్యూయల్ గేజ్ను గమనించడం. ట్యాంక్‌లో తగినంత పెట్రోల్ లేదా డీజిల్ ఉందో లేదో చూసుకోవాలి. కొన్నిసార్లు ఫ్యూయల్ గేజ్ సాంకేతిక లోపం వల్ల తప్పుడు రీడింగ్ చూపిస్తుంది. లేదా మనం తొందరపాటులో కారులో ఇంధనం అయిపోయిన విషయాన్ని గమనించకపోవచ్చు. దీనితో పాటు, ఒకసారి కారు కింద కూడా వంగి చూడాలి. ఇంధన పైపుల్లో ఎక్కడైనా పగుళ్లు లేదా కట్స్ పడితే పెట్రోల్/డీజిల్ కింద కారుతుంటుంది. ఒకవేళ ఇంధనం ఎక్కువగా లీక్ అవుతున్నట్లు అనిపిస్తే, పైపు దెబ్బతిన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇంధనం సక్రమంగా ఇంజిన్‌కు అందకపోతే కారు స్టార్ట్ అవ్వడం చాలా కష్టమవుతుంది.
బ్యాటరీ టెర్మినల్స్‌పై తెల్లటి పౌడర్ పేరుకుపోయిందా?
ఒకవేళ మీరు కారు తాళం తిప్పినా (ఇగ్నిషన్ ఆన్ చేసినా) లేదా సెల్ఫ్ స్టార్ట్ బటన్ నొక్కినా ఇంజిన్ నుండి ఎలాంటి శబ్దం రాకపోతే బ్యాటరీలో లోపం ఉందని గ్రహించాలి. అలాగే డ్యాష్‌బోర్డ్ లైట్లు చాలా డిమ్‌గా వెలుగుతూ, బ్లింక్ అవుతున్నా కూడా బ్యాటరీ వీక్ అయినట్లే లెక్క. ఇలాంటప్పుడు కారు బోనెట్ తెరిచి, బ్యాటరీకి ఉన్న రెండు టెర్మినల్స్ (వైర్లు కనెక్ట్ అయ్యే చోటు)ను పరిశీలించాలి. వాటిపై తరచుగా తెల్లటి పౌడర్ లేదా కార్బన్ పేరుకుపోతుంటుంది. అలా ఉంటే వాటిని జాగ్రత్తగా శుభ్రం చేయాలి. దాంతో పాటు బ్యాటరీ వైర్లు వదులుగా ఉన్నాయేమో చూసి, ఒకవేళ లూజ్‌గా ఉంటే వాటిని గట్టిగా బిగించాలి. చాలా సందర్భాల్లో కేవలం ఈ చిన్న పని చేయడం వల్లనే కారు వెంటనే రీస్టార్ట్ అవుతుంది.
ఇంజిన్ ఓవర్‌హీట్ అయితే పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి
లాంగ్ జర్నీలలో కారు ఇంజిన్ విపరీతంగా వేడెక్కిపోతుంటుంది. డ్యాష్‌బోర్డ్‌లోని టెంపరేచర్ మీటర్ సూది H (హాట్) వైపునకు వెళ్లినా, లేదా బోనెట్ లోపలి నుంచి పొగలు, ఆవిరి వస్తున్నా ఇంజిన్ ఓవర్‌హీట్ అయిందని గుర్తించాలి. ఇలాంటి సమయంలో డ్రైవర్లు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. కారు ఆపిన వెంటనే రేడియేటర్ క్యాప్ (మూత)ను తెరవడం. వేడిగా ఉన్న ఇంజిన్ రేడియేటర్ మూతను తీస్తే, లోపల మరిగిపోతున్న కూలెంట్ లిక్విడ్ లేదా నీరు ఒక్కసారిగా పైకి చిమ్ముతుంది. దీనివల్ల ముఖం, చేతులు కాలిపోయి తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కారును ఒక పక్కన ఆపి కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాతే రేడియేటర్ మూత తీసి కూలెంట్ లేదా నీటి స్థాయిని చెక్ చేసి, తక్కువగా ఉంటే వాటిని నింపాలి.
కారు ఫ్యూజ్ బాక్స్ ఎక్కడ ఉంటుంది?
ఆధునిక కార్లలో ఉండే అనేక ముఖ్యమైన ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్నీ ఫ్యూజ్‌ల సహాయంతోనే పనిచేస్తాయి. ఒకవేళ ఫ్యూయల్ పంప్, ఇగ్నిషన్ సిస్టమ్ లేదా ఇతర కీలక భాగాలకు సంబంధించిన ఫ్యూజ్ వైర్ కాలిపోతే కారు అస్సలు స్టార్ట్ అవ్వదు. సాధారణంగా ఈ ఫ్యూజ్ బాక్స్ కారు బోనెట్ లోపల లేదా స్టీరింగ్ కింద డ్యాష్‌బోర్డ్ భాగంలో ఉంటుంది. కార్ మ్యాన్యువల్ బుక్ లేదా ఫ్యూజ్ బాక్స్ మూత లోపలి వైపు ఉన్న రేఖాచిత్రం (డయాగ్రామ్) చూస్తే, ఏ ఫ్యూజ్ ఏ సిస్టమ్‌కు సంబంధించిందో సులభంగా అర్థమవుతుంది. కాలిపోయిన ఫ్యూజ్ స్థానంలో కొత్త ఫ్యూజ్ వైర్ పెడితే సమస్య వెంటనే పరిష్కారమవుతుంది.
గుంతల రోడ్ల వల్ల వదులయ్యే వైరింగ్ కనెక్షన్లు
మన దేశంలో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధ్వాన్నపు రోడ్లు, పెద్ద పెద్ద గుంతలు, ప్రయాణంలో కారు పదే పదే ఎదుర్కొనే భారీ జెర్క్స్ వల్ల ఇంజిన్‌లోని వివిధ సెన్సార్ల కనెక్టర్లు లేదా వైరింగ్ వదులైపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు వైర్లు పూర్తిగా ఊడిపోతాయి కూడా. అందుకే కారు ఆగిపోయినప్పుడు బోనెట్ తెరిచి, లోపల ఉన్న వైర్లు, ప్లగ్‌లు లేదా కప్లర్లు ఏవైనా వాటి స్థానాల నుంచి ఊడిపోయాయేమో నిశితంగా గమనించాలి. ఒకవేళ ఏదైనా వైర్ కనెక్షన్ ఊడినట్లు కనిపిస్తే, దానిని జాగ్రత్తగా తిరిగి యథాస్థానంలో గట్టిగా అమర్చాలి. చాలా సార్లు కేవలం ఒక చిన్న లూజ్ కనెక్షన్ వల్లే కారు మొత్తం ఆగిపోతుంటుంది. ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే మెకానిక్ సాయం లేకుండానే మీ కారును మీరే సులభంగా రిపేర్ చేసుకోవచ్చు.

