ఈ చిన్న తప్పులు చేస్తే భారీగా ఖర్చు అవ్వడం ఖాయం

Car Maintenance Tips: మీ కారు రోడ్డుపై ఎంత స్మూత్‌గా వెళుతుంది అనేది కేవలం ఇంజిన్ మీద మాత్రమే కాదు, ఆ కారుకున్న సస్పెన్షన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. రోడ్డు మీద ఉండే గుంతలు, స్పీడ్ బ్రేకర్ల నుంచి వచ్చే షాక్‌లను తట్టుకుని, కారులో కూర్చున్న వారికి కుదుపులు తెలియకుండా చేసేది ఇదే. అయితే, మన డ్రైవింగ్ అలవాట్లు సరిగ్గా లేకపోతే, ఈ సస్పెన్షన్ త్వరగా పాడైపోయి జేబుకి చిల్లు పడటం ఖాయం. అసలు సస్పెన్షన్ లైఫ్ పెరగాలంటే ఏం చేయాలో, ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గుంతలు చూసి గజగజ వణుకుతున్నారా?

చాలామంది డ్రైవర్లు రోడ్డు మీద గుంతలు ఉన్నా, స్పీడ్ బ్రేకర్లు ఉన్నా పట్టించుకోకుండా వేగంగా వెళుతుంటారు. ఇలా చేయడం వల్ల సస్పెన్షన్ లోని షాక్ అబ్జార్బర్లు, స్ప్రింగ్‌లు మరియు బాల్ జాయింట్లపై ఒక్కసారిగా తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల అవి త్వరగా అరిగిపోవడమే కాకుండా, విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి, రోడ్డు సరిగ్గా లేనప్పుడు కారు వేగాన్ని తగ్గించడం వల్ల సస్పెన్షన్ విడిభాగాలకు ఎక్కువ కాలం మన్నుతాయి.

టైర్ ప్రెజర్ సరిగ్గా ఉందా?

సస్పెన్షన్ ఆరోగ్యం టైర్లలో ఉండే గాలితో ముడిపడి ఉంటుంది. టైర్లలో గాలి తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా అది నేరుగా సస్పెన్షన్ మీద ప్రభావం చూపుతుంది. గాలి తక్కువగా ఉంటే కారు నడపడం కష్టమవుతుంది, ఎక్కువగా ఉంటే రోడ్డు మీద వచ్చే ప్రతి చిన్న కుదుపు సస్పెన్షన్‌కు తగులుతుంది. అందుకే వారానికి ఒకసారి టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవడం, నిర్ణీత కిలోమీటర్ల తర్వాత టైర్ రొటేషన్ చేయడం వల్ల కారు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది.

వీల్ అలైన్‌మెంట్ ఎందుకు ముఖ్యం?

కారు నడిపేటప్పుడు స్టీరింగ్ ఒక వైపుకు లాగేస్తున్నట్లు అనిపిస్తుందా? అయితే మీ కారుకు వీల్ అలైన్‌మెంట్ అవసరమని అర్థం. అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోతే టైర్లు అసమానంగా అరిగిపోవడమే కాకుండా, సస్పెన్షన్ పార్ట్స్ మీద అనవసరమైన లోడ్ పడుతుంది. ఇది చివరకు స్టీరింగ్ సిస్టమ్ కూడా పాడవ్వడానికి దారితీస్తుంది. ప్రతి 5,000 నుంచి 7,000 కిలోమీటర్లకు ఒకసారి అలైన్‌మెంట్ చేయించడం వల్ల సస్పెన్షన్ లైఫ్ గణనీయంగా పెరుగుతుంది.

ఓవర్‌లోడింగ్ అంటే ఆత్మహత్యాసదృశ్యమే

కారు సామర్థ్యానికి మించి సామాన్లు లేదా మనుషులను ఎక్కించడం వల్ల సస్పెన్షన్ తీవ్రంగా దెబ్బతింటుంది. కంపెనీ సూచించిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే, షాక్ అబ్జార్బర్లు పూర్తిగా లోపలికి నొక్కుకుపోయి వాటి పనితీరును కోల్పోతాయి. దీనివల్ల కారు కింద భాగం నేలకు తగిలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కారు లోడ్ లిమిట్ దాటకుండా చూసుకోవాలి.

సర్వీసింగ్ విషయంలో నిర్లక్ష్యం వద్దు

సస్పెన్షన్ పాడవుతున్నప్పుడు కారు నుంచి కిర్రుమనే శబ్దాలు రావడం లేదా మూల మలుపుల వద్ద కారు ఎక్కువగా ఒరగడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మెకానిక్ తో తనిఖీ చేయించాలి. చిన్న సమస్య ఉన్నప్పుడే పరిష్కరిస్తే పెద్ద ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు. రెగ్యులర్ సర్వీసింగ్‌లో సస్పెన్షన్ విడిభాగాలకు గ్రీసింగ్ చేయించడం వల్ల అవి స్మూత్‌గా పనిచేస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story