Car Safety Tips : కారులో సస్పెన్షన్ సిస్టమ్ అనేది కేవలం హాయిగా, సౌకర్యవంతంగా ప్రయాణించడానికి మాత్రమే కాదు. అది వాహనం భద్రత, నియంత్రణకు అత్యంత కీలకమైంది. గుంతలు ఉన్న రోడ్లపై జర్కులను తగ్గించడం, టైర్లు ఎల్లప్పుడూ రోడ్డును సరిగ్గా తాకేలా చూడటం, మలుపులు తిరిగేటప్పుడు కారు బ్యాలెన్స్ తప్పకుండా స్థిరంగా ఉంచడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. కాలక్రమేణా షాక్ అబ్జార్బర్లు, స్ప్రింగ్‌లు, స్ట్రట్స్, ఇతర భాగాలు అరిగిపోతుంటాయి. వీటిని సరైన సమయంలో తనిఖీ చేయకపోతే కారు బ్రేకింగ్ సిస్టమ్, హ్యాండ్లింగ్, టైర్ల జీవితకాలం తీవ్రంగా దెబ్బతింటాయి.

సస్పెన్షన్ లోపాన్ని తెలిపే 5 ముఖ్యమైన సంకేతాలు

1. కారు పరిమితికి మించి ఊగడం

మీ కారు స్పీడ్ బ్రేకర్లు, గుంతలు లేదా అసమాన రోడ్లపై వెళ్లేటప్పుడు అవసరానికి మించి ఎగిరెగిరి పడుతున్నా లేదా లోపల కూర్చున్న వారికి తీవ్రమైన జర్కులు అనిపిస్తున్నా అది సస్పెన్షన్ సమస్యకు ప్రధాన సంకేతం. చెడిపోయిన షాక్ అబ్జార్బర్లు రోడ్డుపై వచ్చే షాక్‌లను సరిగ్గా కంట్రోల్ చేయలేవు. ఇలాంటి సమయంలో వెంటనే కారును గ్యారేజీకి తీసుకెళ్లడం శ్రేయస్కరం.

2. టైర్లు అసమానంగా అరిగిపోవడం

సస్పెన్షన్ దెబ్బతిన్నప్పుడు కారు బరువు నాలుగు చక్రాలపై సమానంగా పడదు. దీనివల్ల టైర్ల కొన్ని భాగాలు మాత్రమే ఎక్కువగా అరిగిపోతాయి. మీరు ఒక టైర్ ఒక వైపు అంచు మాత్రమే ఎక్కువగా అరిగిపోవడం లేదా అసమానమైన తరుగుదలను గమనిస్తే, అది సస్పెన్షన్, వీల్ అలైన్‌మెంట్ లేదా బుషింగ్స్ లోపానికి స్పష్టమైన సంకేతం.

3. ప్రయాణంలో వింత శబ్దాలు రావడం

కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు గుంతలు లేదా స్పీడ్ బ్రేకర్లు దాటుతున్న సమయంలో కట్ కట్, చరచర లేదా పెద్ద శబ్దాలు వస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దు. బాల్ జాయింట్లు, కంట్రోల్ ఆర్మ్‌లు, స్వే బార్ లింక్‌లు లేదా ఇతర సస్పెన్షన్ పార్ట్స్‌ అరిగిపోవడం లేదా ఊడిపోవడం వల్ల ఈ తరహా వింత శబ్దాలు వస్తాయి.

4. కారు ఒక వైపునకు లాగడం

నేరుగా ఉన్న రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు లేదా బ్రేక్ వేసినప్పుడు కారు పదే పదే ఒక వైపునకు లాగుతుంటే, అది సస్పెన్షన్‌లో అసమతుల్యత ఉన్నట్లు అర్థం. బలహీనపడిన స్ప్రింగ్‌లు లేదా పాడైన స్ట్రట్‌ల వల్ల కారు బ్యాలెన్స్ దెబ్బతింటుంది, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.

5. ఆయిల్ లీకేజీ లేదా భాగాల దెబ్బతినడం

షాక్ అబ్జార్బర్ల నుంచి నూనె కారడం, భాగాల కింద గ్రీజు పేరుకుపోవడం లేదా ఏవైనా భాగాలు విరిగినట్లు స్పష్టంగా కనిపిస్తే సస్పెన్షన్ వ్యవస్థ పూర్తిగా పాడైపోయిందని గ్రహించాలి. ఇలాంటి పరిస్థితి కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే అనుభవజ్ఞుడైన మెకానిక్‌తో తనిఖీ చేయించాలి.

సస్పెన్షన్ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సస్పెన్షన్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్ధంగా తనిఖీ చేయించుకోవడం వల్ల సురక్షితమైన డ్రైవింగ్ అనుభూతిని పొందడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే భారీ ఖర్చులను నివారించవచ్చు. ఆటోమొబైల్ నిపుణుల సలహా ప్రకారం, ప్రతి 10,000 నుంచి 15,000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కారు సస్పెన్షన్ వ్యవస్థను సర్వీసింగ్ సెంటర్‌లో చూపించడం మంచి అలవాటు.

PolitEnt Media

PolitEnt Media

Next Story