ఫాస్టాగ్ లేకపోతే షాక్ తప్పదు

Toll Plaza : జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటివరకు టోల్ ప్లాజాల వద్ద చిల్లర కష్టాలు పడుతున్నారా? అయితే ఇకపై ఆ పద్ధతికి పూర్తిగా స్వస్తి పలకాల్సిన సమయం వచ్చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేసి, 100% డిజిటల్ టోల్ వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రయాణికులు కేవలం ఫాస్టాగ్ లేదా ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

ఎందుకు ఈ మార్పు?

టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల వల్ల వాహనాలు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడం, దీనివల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడటం మరియు చిల్లర విషయంలో గొడవలు జరగడం వంటి సమస్యలను NHAI గుర్తించింది. ప్రస్తుతం దేశంలో 98 శాతానికి పైగా వాహనాలు ఫాస్టాగ్‌ను వాడుతున్నప్పటికీ, మిగిలిన 2 శాతం నగదు లావాదేవీల వల్ల కూడా ఆలస్యం జరుగుతోంది. దీన్ని పూర్తిగా నివారించి, ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు ఈ డిజిటల్ ఓన్లీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద పారదర్శకత పెరగడమే కాకుండా, ప్రయాణికులకు సమయం కూడా ఆదా అవుతుంది.

పెనాల్టీలు కూడా భారీగానే..

కొత్త నిబంధనల ప్రకారం, ఒకవేళ మీ కారుకు ఫాస్టాగ్ లేకపోయినా లేదా అది పనిచేయకపోయినా నగదు చెల్లించే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఒకవేళ నగదు తీసుకున్నప్పటికీ, దానికి భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నగదు ద్వారా చెల్లించాల్సి వస్తే, సాధారణ టోల్ ధర కంటే 2 రెట్లు (డబుల్) వసూలు చేస్తారు. ఫాస్టాగ్ లేని వారు యూపీఐ ద్వారా చెల్లిస్తే, సాధారణ ఛార్జీ కంటే 1.25 రెట్లు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఫాస్టాగ్ లేకుండా డిజిటల్ లేదా నగదు రూపంలో చెల్లిస్తే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. కాబట్టి ప్రయాణానికి ముందే ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోవడం మంచిది.

ఏప్రిల్ 1 నుంచి అసలు కథ

దేశవ్యాప్తంగా ఉన్న 1,150 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను ఈ డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా బారియర్ లెస్ టోల్ వ్యవస్థకు పునాదులు పడనున్నాయి. భవిష్యత్తులో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు కూడా అందుబాటులోకి రానుంది. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి రోడ్ల మీదకు వెళ్లే ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్‌లు సిద్ధంగా ఉంచుకోవాలని, ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story