FASTag: దివ్యాంగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఫాస్టాగ్ నిబంధనల్లో భారీ మార్పులు
భారీ మార్పులు

FASTag: దివ్యాంగులకు కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ అందించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు టోల్ పన్ను మినహాయింపు పొందేందుకు ఉపయోగించే ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్ రెన్యూవల్ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు దివ్యాంగులు ప్రతి సంవత్సరం తమ ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా రెన్యూవల్ చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా, వ్యక్తి వైకల్య శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుని వ్యాలిడిటీ కాలాన్ని నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డిసేబిలిటీ శాతాన్ని బట్టి వ్యాలిడిటీ ఖరారు
సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. దివ్యాంగుల కేటగిరీ కింద నమోదైన వాహనాలకు చెల్లుబాటు అయ్యే డిసేబిలిటీ సర్టిఫికేట్ లేదా UDID కార్డు ఆధారంగా ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్ జారీ చేస్తారు. వైకల్యం 70 శాతం నుంచి 100 శాతం వరకు ఉన్న వ్యక్తులకు ఇచ్చే ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్ కాలపరిమితిని 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. అదే సమయంలో 40 శాతం నుంచి 70 శాతం కంటే తక్కువ వైకల్యం కలిగిన వారికి ఈ ఫాస్టాగ్ వ్యాలిడిటీ 3 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఈ నిర్ణయం వల్ల అర్హులైన దివ్యాంగులకు ఏటా ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గడమే కాక సమయం ఆదా అవుతుంది.
అసలు ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్ అంటే ఏమిటి?
ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్ అనేది జాతీయ రహదారులపై టోల్ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు పొందిన నిర్దిష్ట వాహనాల కోసం ఉచితంగా ఇచ్చే ప్రత్యేక RFID స్టిక్కర్. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టోల్ కట్టాల్సిన అవసరం లేని వాహనాల విండ్‌షీల్డ్‌పై ఈ స్టిక్కర్‌ను అతికించాలి. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద RFID స్కానర్లు సదరు వాహనాన్ని సులువుగా గుర్తించి ఉచితంగా ముందుకు పంపుతాయి. ఇది టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యలు రాకుండా గంటల కొద్దీ వేచి ఉండే అవసరం లేకుండా వాహనాల రాకపోకలను సులభతరం చేస్తుంది.
ప్రాసెస్ మరింత సులభతరం
ఫాస్టాగ్ వ్యాలిడిటీ ముగిసిన తర్వాత అర్హత ప్రమాణాలను బట్టి దానిని తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. అయితే నేషనల్ హైవేస్ ఫీ రూల్స్, 2008 ప్రకారం నిర్ణయించిన అర్హతలు, నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పుల ద్వారా జాతీయ రహదారులపై టోల్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని అధికారులు వెల్లడించారు. నిర్ణీత ప్రమాణాలు పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ టోల్ మినహాయింపు ప్రయోజనం అందుతుంది.

