RC Transfer: వాహనదారులకు బిగ్ రిలీఫ్.. ఇక సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల RC ట్రాన్స్ఫర్ చాలా ఈజీ
బైక్‌ల RC ట్రాన్స్ఫర్ చాలా ఈజీ

RC Transfer: పాత కార్లు లేదా బైక్‌లు కొనుగోలు చేసేవారికి, అమ్మేసేవారికి రాబోయే రోజుల్లో పెద్ద ఉపశమనం లభించనుంది. వాహనాల ఓనర్ షిప్ ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపైకి బదిలీ చేసే ప్రక్రియను అత్యంత సరళతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలను రూపొందిస్తోంది. రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. సెకండ్ హ్యాండ్ వాహనం విక్రయించిన తర్వాత కొత్త యజమాని పేరు మీదకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(RC) మార్చడంలో ప్రజలు పడుతున్న నరకయాతనకు స్వస్తి పలకడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.
ఈజ్ ఆఫ్ వెహికల్ ఓనర్ షిప్ ఇండెక్స్‌లో ఏపీ టాప్
ఇండియా టెక్ డోట్ ఆర్గ్, కన్జ్యూమర్ వాయిస్ సంయుక్తంగా నిర్వహించిన ఈజ్ ఆఫ్ వెహికల్ ఓనర్ షిప్ ఇండెక్స్ (EVOI) నివేదికలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పాత వాహనాల ఓనర్ షిప్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతోందో ఈ సూచిక స్పష్టం చేస్తోంది. డిజిటల్ సేవలు, పారదర్శకత, డీలర్ల సహకారం, తక్కువ సమయం ప్రాతిపదికగా ఈ ర్యాంకులు కేటాయించారు. ఏపీలో ఆర్సీ ట్రాన్స్ఫర్ కావడానికి 7 నుంచి 10 రోజుల సమయం పడుతుండగా, ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 30 రోజులకు పైగా పడుతోంది.
రాష్ట్రాల మధ్య రోడ్డు టాక్స్ భారీ తేడాలు
వివిధ రాష్ట్రాల మధ్య రోడ్డు టాక్స్ వ్యత్యాసాలు వాహనదారులకు ప్రధాన సమస్యగా మారుతున్నాయి. ఉదాహరణకు రూ. 6 లక్షల విలువైన పెట్రోల్ కారుపై ఉత్తరప్రదేశ్‌లో కేవలం 3 శాతం రోడ్డు టాక్స్ ఉంటే, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకంగా 14 శాతం వరకు వసూలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసం కారణంగా ఒకే కారు ధరపై రాష్ట్ర సరిహద్దులు దాటగానే రూ. 66 వేల కంటే ఎక్కువ తేడా కనిపిస్తోంది. దీనికి తోడు నివేదికలో పేర్కొన్న 15 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలు ఆన్లైన్లో అప్లై చేసినప్పటికీ, కాగితాల హార్డ్ కాపీలను ఆర్టీఓ ఆఫీసులో నేరుగా ఇవ్వాలని కోరుతుండటం ఇబ్బందికరంగా మారింది.
సమయం వృథా కాకుండా సిఫార్సులు ఇవే
కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలలో మార్పులు చేయాలని ఈ అధ్యయన నివేదిక కేంద్రానికి సూచించింది. ఆర్సీ బదిలీ కోసం కాలపరిమితిని కచ్చితంగా నిర్దేశించాలని స్పష్టం చేసింది:
* ఆన్లైన్ దరఖాస్తు ఆమోదానికి కేవలం 1 నుండి 2 రోజులు.
* కొత్త ఆర్సీని యజమానికి పంపడానికి 2 నుండి 3 రోజులు.
* ఇతర రాష్ట్రాలకు వాహనాన్ని బదిలీ చేసే నిరభ్యంతర పత్రం (NOC) మంజూరుకు 2 రోజులు.
* రోడ్డు టాక్స్ రీఫండ్ ప్రక్రియ పూర్తి కావడానికి 14 రోజుల గడువు.
సర్వేలో వెల్లడైన చేదు నిజాలు
ఈ అధ్యయనంలో భాగంగా నిర్వహించిన సర్వేలో దాదాపు 39 శాతం మంది వాహనం అమ్మేసినప్పటికీ, ఇప్పటివరకు తమ పేరు మీద నుంచి ఆర్సీ బదిలీ కాకుండా అలాగే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 9.6 శాతం మంది మాత్రమే రెండు వారాల కంటే తక్కువ సమయంలో తమ వాహనం ఆర్సీ కొత్తవారి పేరుపైకి మారినట్లు వెల్లడించారు. ఈ అడ్డంకులన్నింటినీ తొలగించి, దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకీకృత డిజిటల్ విధానాన్ని తీసుకురావడానికి కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

