Citroen Basalt vs Kia Sonet : కియా సోనెట్ వర్సెస్ బసాల్ట్..మైండ్ బ్లాక్ చేస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల పోరు
మైండ్ బ్లాక్ చేస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల పోరు

Citroen Basalt vs Kia Sonet : భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఒకవైపు అదిరిపోయే డిజైన్‌తో ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ బసాల్ట్ దూసుకొస్తుంటే, మరోవైపు ఫీచర్ల ఖజానాగా పేరున్న కియా సోనెట్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. కొత్తగా కారు కొనాలనుకునే వారు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని తలలు పట్టుకుంటున్నారు. అందుకే, ఈ రెండు కార్ల మధ్య ఉన్న తేడాలు, ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం,సేఫ్టీ గురించి వివరంగా తెలుసుకుందాం.
సిట్రోయెన్ బసాల్ట్ ఒక కూపే స్టైల్ ఎస్‌యూవీ. అంటే దీని వెనుక భాగం స్లోపింగ్‌గా ఉండి చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. రోడ్డు మీద వెళ్తుంటే అందరూ తిరిగి చూసేలా దీని డిజైన్ ఉంటుంది. మరోవైపు కియా సోనెట్ పక్కా కాంపాక్ట్ ఎస్‌యూవీ లుక్‌తో ఉంటుంది. ఇది చూడటానికి చాలా గంభీరంగా, మజిక్యులర్‌గా కనిపిస్తుంది. మీకు విభిన్నమైన, కొత్త రకమైన డిజైన్ కావాలంటే బసాల్ట్ వైపు మొగ్గు చూపవచ్చు. కానీ ట్రెడిషనల్ ఎస్‌యూవీ లుక్ ఇష్టపడే వారికి సోనెట్ నచ్చుతుంది.
ఫీచర్ల విషయానికి వస్తే కియా సోనెట్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. సోనెట్‌లో సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. సిట్రోయెన్ బసాల్ట్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి అవసరమైన ఫీచర్లు ఉన్నాయి కానీ, సోనెట్ ఇచ్చే లగ్జరీ ఫీచర్లు ఇందులో తక్కువ. అయితే బసాల్ట్‌లో బూట్ స్పేస్ (డిక్కీ) ఎక్కువగా ఉండటం వల్ల లాంగ్ ట్రిప్పులకి లగేజీ సర్దుకోవడం చాలా సులభం.
డ్రైవింగ్ పరంగా చూస్తే ఈ రెండు కార్ల స్వభావం వేరు. సిట్రోయెన్ బసాల్ట్ కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. దీని సస్పెన్షన్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది, కాబట్టి గుంతల రోడ్ల మీద కూడా ప్రయాణం చాలా హాయిగా ఉంటుంది. ఇక కియా సోనెట్ విషయానికి వస్తే, ఇందులో పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ కావాలనుకునే వారి కోసం పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లలో సోనెట్ ఎక్కువ వెరైటీని అందిస్తోంది. వేగంగా వెళ్లాలి అనుకునే వారికి సోనెట్ బెస్ట్, హాయిగా సౌకర్యవంతంగా వెళ్లాలి అనుకునే వారికి బసాల్ట్ బెస్ట్.
సేఫ్టీ విషయంలో కియా సోనెట్ ఒక మెట్టు పైనే ఉంది. ఇందులో లెవల్-1 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. సిట్రోయెన్ బసాల్ట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బేసిక్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కానీ, సోనెట్ ఇచ్చే హైటెక్ సేఫ్టీ ఇందులో లేదు. ధర పరంగా చూస్తే ఈ రెండు కార్లు దాదాపు ఒకే రేంజ్ లో ఉన్నప్పటికీ, ఇచ్చే ఫీచర్లను బట్టి చూస్తే సోనెట్ వాల్యూ ఫర్ మనీగా అనిపిస్తుంది.
మీరు ఒక యూనిక్ డిజైన్ ఉన్న కారు కావాలని, ప్రయాణం చాలా కంఫర్టబుల్ గా ఉండాలని కోరుకుంటే సిట్రోయెన్ బసాల్ట్ తీసుకోవచ్చు. దీని ఇంటీరియర్ స్పేస్, సీటింగ్ సౌకర్యం చాలా బాగుంటాయి. అలా కాకుండా మీకు అత్యాధునిక ఫీచర్లు, సన్‌రూఫ్, మంచి ఆడియో సిస్టమ్, పవర్‌ఫుల్ ఇంజిన్, హైటెక్ సేఫ్టీ కావాలంటే కళ్లు మూసుకుని కియా సోనెట్ కి వెళ్ళిపోవచ్చు. సర్వీస్ నెట్‌వర్క్ పరంగా కూడా కియాకు దేశవ్యాప్తంగా ఎక్కువ షోరూమ్‌లు ఉన్నాయి.

