Royal Enfield Sales : బుల్లెట్ కాదు..హంటర్ అసలే కాదు..నవంబర్ సేల్స్‌లో దుమ్మురేపిన బైక్ ఇదే
నవంబర్ సేల్స్‌లో దుమ్మురేపిన బైక్ ఇదే

Royal Enfield Sales : భారతీయ రోడ్లపై రాజసం ఒలికించే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజే వేరు. మార్కెట్లో ఎన్ని కొత్త కంపెనీలు వస్తున్నా, ఎన్ని మోడల్స్ మారుతున్నా.. బుల్లెట్ ప్రియుల మనసు మాత్రం ఎప్పుడూ ఆ పాత క్లాసిక్ లుక్ దగ్గరే ఆగిపోతుంది. తాజాగా విడుదలైన నవంబర్ 2025 సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే ఇది మరోసారి అక్షరాల నిజమనిపిస్తోంది. హంటర్, బుల్లెట్ వంటి గట్టి పోటీదారులు ఉన్నప్పటికీ ఒకే ఒక బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సామ్రాజ్యాన్ని ఏలుతోంది. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.
నవంబర్ 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 90,405 బైక్‌లను విక్రయించింది. ఇందులో సింహభాగం కేవలం క్లాసిక్ 350దే కావడం విశేషం. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 34,793 క్లాసిక్ బైక్‌లు అమ్ముడయ్యాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే అమ్మకాలు 26.46 శాతం పెరిగాయి. కంపెనీ అమ్మే మొత్తం బైక్‌లలో దాదాపు 38 శాతం వాటా ఈ ఒక్క మోడల్‌దేనంటే, జనం దీనిపై ఎంతగా మనసు పారేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే, అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో అమ్మకాలు 22.63 శాతం తగ్గాయి. ఇది ప్రతి ఏడాది జరిగేదే. అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగల పుణ్యమా అని 1,16,844 బైక్‌లు అమ్ముడవ్వగా, నవంబర్ వచ్చేసరికి ఆ జోరు కాస్త తగ్గింది. దీంతో క్లాసిక్ సహా అన్ని మోడల్స్ అమ్మకాలు నెలవారీగా కొంత పడిపోయాయి. అయినప్పటికీ, వార్షిక ప్రాతిపదికన చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్రాఫ్ పైకే ఉండటం విశేషం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యామిలీలో హంటర్ 350 రెండో స్థానంలో నిలిచింది. 20,792 యూనిట్ల అమ్మకాలతో క్లాసిక్ తర్వాత తానేనని నిరూపించుకుంది. ఇక ఎవర్ గ్రీన్ బుల్లెట్ 350 విషయానికి వస్తే.. 20,547 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే బుల్లెట్ సేల్స్ 26.89 శాతం పెరగడం గమనార్హం. నాల్గో స్థానంలో మీటియార్ 350 నిలిచింది. మొత్తం 10,091 మీటియార్ బైక్‌లు అమ్ముడయ్యాయి. అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ టాప్-4 మోడల్స్ అన్నీ కూడా 350 సీసీ సెగ్మెంట్‌వే కావడం ఇక్కడ విశేషం.
మొత్తం మీద చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటేనే క్లాసిక్ 350 అని కస్టమర్లు ఫిక్సైపోయారు. కొత్తగా వచ్చిన హంటర్ కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నా, ఐకానిక్ బుల్లెట్ పాత తరం వారిని పిలుస్తున్నా.. క్లాసిక్ 350 మాత్రం అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. మార్కెట్లో పోటీ పెరిగినా, ధరలు మారినా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి సౌండ్ మాత్రం తగ్గడం లేదు.

