Royal Enfield Classic 350 vs Jawa 42 : రాయల్ ఎన్‌ఫీల్డ్ వర్సెస్ జావా.. యువత మనసు దోచే బైక్ ఏది?
యువత మనసు దోచే బైక్ ఏది?

Royal Enfield Classic 350 vs Jawa 42 : భారతీయ రోడ్లపై రాజసం ఒలకబోసే బైక్‌లు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి రాయల్ ఎన్‌ఫీల్డ్, జావా. క్లాసిక్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో యువతను ఊర్రూతలూగిస్తున్న ఈ రెండు బైక్‌ల మధ్య ఎప్పుడూ ఒక యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా 42 బైక్‌లలో ఏది మొనగాడు? మైలేజీలో ఏది కింగ్? పవర్ ఎవరికి ఎక్కువ? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మీ బడ్జెట్, మీ రైడింగ్ స్టైల్‌కు తగ్గట్టుగా ఈ రెండింటిలో ఏ బైక్ బెస్ట్ అనేది వివరంగా తెలుసుకుందాం.
ధరల యుద్ధం
మీరు తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే లుక్ ఉన్న బైక్ కావాలనుకుంటే జావా 42 మీకు మంచి ఆప్షన్ అని చెప్పాలి. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.59 లక్షల నుంచి ప్రారంభమై రూ. 1.85 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొంచెం ఖరీదైనది. దీని ప్రారంభ ధర రూ. 1.82 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్ రూ. 2.17 లక్షల వరకు పలుకుతోంది. అంటే జావా 42 తో పోలిస్తే క్లాసిక్ 350 ధర కొంచెం భారమే అని చెప్పాలి.
ఇంజిన్, పవర్
ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే జావా 42 లో 294.72cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది చూడటానికి చిన్నదిగా అనిపించినా, ఏకంగా 27 PS పవర్, 27 Nm టార్క్‌ను ఇస్తుంది. అంటే ఇది చాలా స్పోర్టీగా, వేగంగా దూసుకుపోతుంది. సిటీలో ట్రాఫిక్‌ను చీల్చుకుంటూ వెళ్లడానికి ఇది పర్ఫెక్ట్. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లో 349cc ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20 PS పవర్, 27 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక్కడ జావా కంటే పవర్ తక్కువగా ఉన్నప్పటికీ, క్లాసిక్ 350 ఇచ్చే రైడింగ్ అనుభవం వేరు. దీని నుంచి వచ్చే ఆ డుగ్ డుగ్ శబ్దం, రిలాక్స్‌డ్ రైడింగ్ స్టైల్ కోసం చాలా మంది దీనికి ఫిదా అయిపోతుంటారు. స్పీడ్ కంటే కంఫర్ట్ ముఖ్యం అనుకునేవారికి క్లాసిక్ 350 బెస్ట్.
ఏది తక్కువ పెట్రోల్ తాగుతుంది?
రోజువారీ వాడకానికి మైలేజీ అనేది చాలా ముఖ్యం. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఇక్కడ కొంచెం పైచేయి సాధిస్తుంది. ఇది లీటరుకు సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అదే జావా 42 విషయానికి వస్తే, ఇది స్పోర్టీ ఇంజిన్ కావడం వల్ల మైలేజీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది లీటరుకు 32 నుంచి 35 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి క్లాసిక్ 350 మైలేజీ పరంగా కొంచెం లాభసాటిగా ఉంటుంది.
రైడింగ్ అనుభవం, ఫీచర్లు
క్లాసిక్ 350 బైక్ చాలా బరువుగా, రోడ్డుపై గంభీరంగా కనిపిస్తుంది. దీని సర్వీస్ నెట్‌వర్క్ దేశమంతా చాలా ఎక్కువగా ఉండటం ఒక పెద్ద ప్లస్ పాయింట్. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సౌకర్యవంతమైన సీటు దీని ప్రత్యేకత. ఇక జావా 42 చాలా తేలికగా ఉంటుంది, దీనివల్ల మలుపుల్లో తిప్పడం చాలా సులభం. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి మోడ్రన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మీకు ట్రెడిషనల్ లుక్ కావాలంటే క్లాసిక్, మోడ్రన్ లుక్ కావాలంటే జావా 42 ఎంచుకోవచ్చు.

